ప్రముఖ టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంటికి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు రావడం జరిగింది. తమకు వచ్చిన పలు ఫిర్యాదులను బట్టి సోదాలు నిర్వహించడానికి వచ్చామని వారు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ నాగార్జున హిల్స్ ప్రాంతంలోని సుజనా చౌదరి ఇల్లును సోదా చేశారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న రెండు సంస్థలను కూడా ఈడీ అధికారులు సోదా చేశారు. దాదాపు మరో రెండు రోజులు ఈ సోదాలు జరుగుతాయని వారు తెలిపారు.
ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. సుజనా చౌదరి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రతో చేయిస్తున్న పని అని పేర్కొన్నారు. దేశానికి తీరని నష్టం కలిగించేందుకు.. అన్యాయం చేసేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని.. ఆయనను గద్దె దించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ లేదా వైసీపీ పార్టీ సీఎం కుర్చీ కోసం మాత్రమే పాకులాడుతున్నాయని.. అంతేగానీ వారికి ప్రజల సమస్యలు పట్టవని యనమల అన్నారు. కానీ ప్రజలకు జరుగుతున్న విషయాలు అన్నీ కూడా తెలుసని.. వారే అన్యాయం చేస్తున్న పాలకులకు బుద్ధి చెబుతారని యనమల అభిప్రాయపడ్డారు.