Fireworks Factory Explosion: బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Fireworks Factory Explosion in AP: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న కార్మికుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొంతమందికి గాయాలైనట్టు సమాచారం అందుతోంది.

Written by - Pavan | Last Updated : Nov 10, 2022, 10:28 PM IST
Fireworks Factory Explosion: బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Fireworks Factory Explosion in AP: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొంతమందికి గాయాలైనట్టు తెలుస్తోంది. కాలిన గాయాలతో బయటపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ భారీ పేలుడుతో బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు అంటుకుని పరిశ్రమ అంతటికీ మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకున్న ఫ్యాక్టరీలో కార్మికులు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమైతున్నప్పటికీ.. దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.

కడియద్ద గ్రామంలో పేలుడు సంభవించగా.. భారీ పేలుడు ధాటికి మండల కేంద్రమైన తాడేపల్లిగూడెం వరకు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు తీవ్రత ఆధారంగా చూస్తే ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా అధికంగానే ఉండే ప్రమాదం ఉందని ప్రత్యక్షసాక్షులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇదిలావుంటే, ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఉన్న పరిసరాలకు సమీపంలోనే చెరువు కూడా ఉండటంతో అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీ అన్నవరం అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్టు తాడేపల్లిగూడెం పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News