గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుంటూరులో పర్యటించనుండగా ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ సహా వామపక్ష పార్టీలు ప్రధాని మోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో అమరావతికి వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చివెళ్లిన ప్రధాని మోదీ ఈసారి ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు, ఈసారి ఏం ఇచ్చి వెళ్తారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సహా అక్కడి టీడీపీ, వామపక్ష పార్టీల నేతలంతా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ మోదీ రాకపై నిన్నటి నుంచే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపధ్యంలో నేడు మోదీ రాకకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గుంటూరులో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొననుండగా సభా ప్రాంగణంతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మరోవైపు విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో ఆదివారం తెల్లవారుజామునుంచే వాహనాలు తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. నిన్న, మొన్న అస్సాం పర్యటనలో పలువురు నల్ల జండాలు చూపించి నిరసనలు తెలిపిన నేపథ్యంలో నేటి గుంటూరు పర్యటనలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండేందుకు భద్రతా బలగాలు గట్టి చర్యలే తీసుకుంటున్నాయి.