ఒకరు ద్రావిడవాదాన్ని ప్రచారం చేస్తూ దక్షిణ భారతీయుల ఉనికిని దేశానికి చాటాలని భావించిన రాజకీయ దురంధరుడైతే.. మరొకరు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ పీఠానికే సవాలు విసిరిన నేత. ఈపాటికే వీరెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకరు ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడైన కరుణానిధి అయితే.. మరొకరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు. పైగా వీరిద్దరికీ కూడా చలనచిత్ర రంగంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. భావజాలాలు వేరైనా ఈ ఇద్దరు నాయకులూ దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారనడంలో అతిశయోక్తి లేదు.
ఒకరు తెలుగు సినీరంగానికి నటసార్వభౌముడైతే.. మరొకరు తమిళ కళారంగానికి కళైంగర్. కరుణానిధి, ఎన్టీఆర్.. వీరిద్దరి దారులు వేరైనా ప్రజల గుండెల్లో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు గొప్ప రాజకీయ వేత్తల జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వ్యాసం మీకు జీన్యూస్ ప్రత్యేకంగా అందిస్తోంది.
సినీ రంగాన్ని పావనం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డలు
తెలుగు సినీ రంగంలో తొలిసారిగా నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా లెక్కలేనన్ని సినిమాలు తీసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. ఇక కరుణానిధి విషయానికి వస్తే ఆయనకు తమిళ సినీ రంగంతో సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయి. 20 ఏళ్ల వయసులోనే రచయితగా ఆయన తమిళ సినిమాలకు పనిచేశారు. ఆయన రాసిన కథలు అన్నీ కూడా హేతువాదాన్ని ప్రమోట్ చేయడమో, సామాజిక సమస్యలపై గురిపెట్టడమో చేశాయి. ఎన్టీఆర్, కరుణానిధి ఇద్దరూ కూడా సమాజం పట్ల బాధ్యతను కలిగిన సినీ ప్రముఖులే.
వరకట్నం, తాతమ్మ కల, తల్లా పెళ్లామా.. లాంటి సోషల్ సినిమాలకు ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహిస్తే.. పరాశక్తి, పాణం, రాజా రాణి లాంటి తమిళ సోషల్ సినిమాలకు కరుణానిధి కథలను అందించారు. పైగా ఇద్దరికీ జానపద కథలంటే అమితమైన ఆసక్తి. తెలుగులో ఎన్టీఆర్ గులేబాకావళి కథ, పరమానందయ్య శిష్యుల కథ, భట్టీ విక్రమార్క లాంటి సినిమాల్లో నటిస్తే.. తమిళంలో కరుణానిధి మలైక్కల్లన్, కాంచితలైవన్ లాంటి జానపద చారిత్రక కథలు రాశారు. ఆ విధంగా ఈ ఇద్దరూ సినీ రంగానికి చేసిన సేవ అందరూ గుర్తుపెట్టుకోదగ్గదే.
అలుపెరగని రాజకీయ పయనం
ఇక రాజకీయరంగంలో కూడా కరుణానిధి, ఎన్టీఆర్ ఒకరికొకరు సాటనే చెప్పుకోవచ్చు. 1982 మార్చి 29 తేదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్టీఆర్.. దాదాపు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి.. అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రపుటలకెక్కాడు. ఇక కరుణానిధి విషయానికి వస్తే.. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డులకెక్కారు. అలాగే ఆయన తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయినా ఇంత గొప్ప నాయకులకు కూడా ఆటుపోట్లు తప్పలేదు.
ఎన్టీఆర్ ఏకస్వామ్య పరిపాలనపై వచ్చిన విమర్శలు, “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అని అనడం పెద్ద దుమారమే రేపాయి. అలాగే కరుణానిధి కూడా 2009లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడు అని చెప్పడం రాజకీయంగా పెద్ద కలకలమే రేపింది. తెలుగుదేశం పార్టీ విషయంలో నాదెండ్ల, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి చీలిక ఏర్పడిందో.. తమిళనాట కూడా ఎమ్జీఆర్, కరుణానిధి విషయంలో అలాగే జరిగింది. అయితే ఎమ్జీఆర్, కరుణానిధి లాంటి ప్రాణ స్నేహితులు వేరు వేరు కుంపట్లు పెట్టుకోవడం చాలా మందికి మనస్కరించలేదు.
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత దుర్దశ అని చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీని నిలువరించడం కష్టమైంది. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. . 2001లో కరుణానిధికి అలాంటి పరాభవమే పొందారు. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వం కరుణానిధిని చాలా అవమానకరమైన రీతిలో అరెస్ట్ చేయించారు. అప్పటికి ఆ వార్త చాలా సంచలనమైంది. ఇలా ఎన్టీఆర్, కరుణానిధి ఇద్దరూ.. రాజకీయ జీవితాలలో ఆటుపోట్లను ఎదుర్కొన్నా.. క్లిష్టమైన సమయాల్లో వారు ప్రజల మద్దతును, ప్రేమను పొందారనే చెప్పవచ్చు.
ప్రజల ఆదరణ పొందిన వేళ..!
ఎన్టీఆర్ హయాంలో స్త్రీలకు ఆస్తిలో కూడా హక్కు ఉండాలని చట్టం తెచ్చారు. అలాగే రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలు తెచ్చారు. తెలంగాణలో కూడా కేసీఆర్, దేవేందర్
గౌడ్ లాంటి నేతలను ఎన్టీఆరే పరిచయం చేశారు. కరుణానిధి విషయం కూడా అంతే. దేశంలోనే తొలిసారిగా రైతు బజార్లకు శ్రీకారం చుట్టడం.. కులాంతర వివాహాలను విశేషంగా ప్రోత్సహించడం చేశారు. ఆ విధంగానే ఆయన ప్రజల ఆదరణను పొందారు. పెరియార్ రామస్వామి దగ్గర నుండి.. ఆ తర్వాత అన్నాదురై నుండి సంక్రమించిన డీఎంకే పగ్గాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం కరుణానిధికి ఉంది. తొలినాళ్లలో కమ్యూనిస్టు భావాలతో ప్రేరేపితమైన కరుణానిధి.. తన కుమారుడికి కూడా గొప్ప కమ్యూనిస్టు నాయకుడైన స్టాలిన్ పేరు పెట్టడం విశేషం.
ఇద్దరూ ఇద్దరే..!
ఒక రకంగా కరుణానిధి, ఎన్టీఆర్ ఇద్దరే భాషా ప్రియులే. తెలుగు వైతాళికుల చరిత్రను నిక్షిప్తం చేసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నిస్తే.. కరుణానిధి తమిళానికి మాత్రం తొలుత రాష్ట్రంలో పెద్దపీట వేయాలని భావించారు. ఇద్దరూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పోరాడారు. అలాగే వివిధ సమస్యలపై గళం విప్పిన తొలి నాయకులు కూడా వీరే. భారతదేశంలో పట్వారీ వ్యవస్థపై తొలిసారిగా బాణం ఎక్కుపెట్టిన నేత ఎన్టీఆర్ అయితే.. ట్రాన్స్‌జెండర్ హక్కులపై తొలిసారిగా గళం విప్పింది కరుణానిధి. అలాగే ఇద్దరూ క్రమశిక్షణ కలిగిన నాయకులే. అయితే కులపరమైన ఘర్షణలు ఇద్దరి హయాంల్లోనూ జరిగాయి. ఏదేమైనా.. దక్షిణాది రాజకీయాల్లో ఎన్టీఆర్, కరుణానిధి ఇద్దరూ కూడా తమదైన శైలిలో రాజకీయ పాలన చేశారనడంలో అతిశయోక్తి లేదు. ప్రజలను తమ వాక్చాతుర్యంతో ప్రభావితం చేయడంలో ఈ ఇద్దరూ కూడా ఘనాపాటిలే... తిరుగులేని నేతలే.