ఇప్పటి వరకు పొత్తులు..ఎత్తుల విషయంలో ఎవరికీ అంతు చిక్కని జగన్ వ్యూహం.. కేటీఆర్ భేటీతో బయటపడింది. ఈ భేటీతో జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ వైపు నడుస్తుందనే పరోక్ష సంకేతాలు ఇచ్చారని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీసుకున్న తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం...
వైసీపీ వాదన ఇదే..
ప్రత్యేక హోదా సాధనకు జాతీయ స్థాయిలో బలమైన పొత్తు అవసరమని..అందుకే హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అనుకూలంగా ఉన్న ఎలాంటి పార్టీలతో నైనా తాము జతకడతామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, హక్కుల కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఆలోచన తెలుసుకునేందుకే కేటీఆర్ తో జగన్ భేటీ నిర్వహించారని వైసీపీ నేతలు సమర్ధిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ..అందుకే వాటికి సమాంతరంగా జాతీయ స్థాయిలో కూటమి కడుతున్న కేసీఆర్ తో కలిసి నడిస్తే తప్పేంటని వైసీపీ నేతలు వాదిస్తున్నారు
టీడీపీ వాదన ఇదే..
ఆంధ్ర రాష్ట్రంపై పెత్తనం చేసేందుకే కేసీఆర్... జగన్ తో జతకట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ గెలిస్తే ఏపీలో కేసీఆర్ పెత్తనం ఖాయమంటున్నారు. ఏపీకి సంబంధించిన అని విషయాల్లో విభేదించిన కేసీఆర్ తో జతకట్టడమనేది అనైతికమని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ జతకడితే.. అది టీడీపీకే ప్రయోజనమన్నారు. ఈ పరిమాణంతో ఎన్నికల్లో టీడీపీకి మరో 30 సీట్లు అదనంగా వస్తాయని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.
చంద్రబాబు విమర్శలకు చెక్ పెట్టేందుకే..
వైసీపీని బీజేపీతో లింక్ పెడుతూ చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటికే బీజేపీని విభజన హామీల దోషిగా చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే బీజేపీతో వైసీపీకి జతకట్టి ఆ వ్యతిరేకతను వైసీపీ పై నెట్టాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన జగన్..ఈ ముద్రను చెరిపి వేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు దగ్గరౌతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడున్నారు..
మరి దీన్ని ఎలా అధిగమిస్తారు..
చంద్రబాబు విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం..భవిష్యత్తలో ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది. కేటీఆర్ భేటీలో పాల్గొన్న జగన్.. బీజేపీతో తాము పొత్తు పెట్టుకోబోమని జనాల్లో సంకేతాలు ఇచ్చారు సరే.. ..టీడీపీ దీన్ని మరో రకంగా ప్రచారం చేసే అస్కారం ఉంది. ప్రధాని మోడీతో జగన్- కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు మొదలు పెట్టారు. మరి దీన్ని జగన్ ఏ మేరకు తిప్పికొడతారు.. అలాగే ఆంధ్రా ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత..జగన్ పార్టీపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సవాళ్లను జగన్ ఎలా అధిగమిస్తేరనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.