న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఎంతో మేలు చేసిందని, ఇంకా భవిష్యత్‌లోనూ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం విశాఖపట్టణం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలతోపాటు ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి బీజేపీ సిద్ధంగా వుందని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఎంత సహాయం చేసినా.. ఏపీ మాత్రం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్లు ఇచ్చినప్పటికీ, ఏపీ సర్కార్ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని మోదీ ప్రశ్నించారు. రెవెన్యూ డెఫిసిట్ ఫండ్ కింద రూ. 20 వేల కోట్ల వరకు రిసోర్స్ గ్యాప్ విడుదల చేసినప్పటికీ ఏపీ సర్కార్ మాత్రం అందలేదని చెబుతోందన్న మోదీ.. మరి ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఏపీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసినట్టుగా ఇన్నేళ్లపాటు ఏపీని పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు అభివృద్ధి చేయలేదని మోదీ ప్రశ్నించారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మా ప్రయత్నంతోనే ప్రకటించారని, పోలవరానికి కేంద్రం వందశాతం ఆర్థిక సహాయం అందిస్తోందని ఈ సందర్భంగా మోదీ వివరించారు. ఇప్పటి వరకు పోలవరానికి రూ. 7 వేల కోట్లు ఇచ్చినప్పటికీ.. ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం అందులో వైఫల్యం చెందినట్టుగా కాగ్ నివేదిక స్పష్టంచేసిందని మోదీ పేర్కొన్నారు.