ఏపీ ప్రత్యేక హోదా కోసం గత కొన్ని నెలలుగా పార్లమెంటు ఆవరణలో వివిధ వేషాలు వేస్తూ.. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్. ఎన్టీఆర్, సత్య సాయిబాబా, కాటికాపరి, హిట్లర్ వంటి వారి వేషాలతో కనువిందు చేసిన శివప్రసాద్ ఇటీవలే హిజ్రా వేషం కూడా వేశారు. ఆ వేషంలో ఆయన మోదీని 'బావా' అని సంబోధించారు. ఎన్ని వేషాలు వేసినా భారత ప్రధాని మోదీ మనసు కరగడం లేదని.. అందుకే ఆఖరికి హిజ్రా వేషం వేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా శివప్రసాద్ తెలిపారు.
హిజ్రా వేషంలో శివప్రసాద్ పలు పాటలు కూడా పాడారు. వివిధ హావభావాలు చేస్తూ కేంద్రంపై సెటైర్లు కూడా విసిరారు. శివప్రసాద్ వేషధారణ చూసి.. ఆయనను సోనియా గాంధీ, గులాంనబీ ఆజాద్ మొదలైన వారు అభినందించారు. చిత్తూరు నుండి ఎంపీగా ఎన్నికైన శివప్రసాద్ ఉద్యోగ రీత్యా న్యాయవాదైనా.. ఆ తర్వాత నాటకాల్లో నటించేవారు. సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన సుపరిచితులు. డేంజర్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి లాంటి సినిమాల్లో కూడా శివప్రసాద్ నటించారు.
అయితే తాజాగా శివప్రసాద్ వేసిన హిజ్రా వేషమే ఇప్పుడు ఆ ఎంపీ కొంప ముంచింది. ఒక ఎంపీ అయ్యి ఉండి.. హిజ్రాలను అవమానపరిచే విధంగా ఆయన ప్రవర్తించారని.. అందుకే ఆయనపై పోలీస్ స్టేషనులో కేసు పెడుతున్నామని తెలిపారు నంద్యాలకు చెందిన హిజ్రా సంఘ ప్రతినిధులు. ఈ క్రమంలో వారు నంద్యాల పోలీస్ స్టేషనులో శివప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. హిజ్రాలను అవమానపరిచే రీతిలో వెకిలి చేష్టలు చేసిన శివప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ కూడా చేస్తున్నారు.
టీడీపీ ఎంపీ పై పోలీస్ కేసు పెట్టిన హిజ్రాలు