2017లో ఏపీలో ప్రభుత్వ పాలన అస్త్యవ్యస్తంగా సాగిందని.. అందుకే ఈ సంవత్సరాన్ని వైఫల్య నామ సంవత్సరంగా భావించవచ్చని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమైందని.. కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టడంలో మాత్రం విజయం సాధించిందని ఆయన తెలిపారు.
ముఖ్యంగా రుణమాఫీ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదాపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుందే గానీ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని రఘువీరారెడ్డి అన్నారు. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతకు ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వం ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు.
అలాగే స్వయాన కాంగ్రెస్ హయాంలో ఏపీకి వచ్చిన తన సొంత జిల్లా చిత్తూరులోని మన్నవరం ప్రాజెక్టును కూడా కాపాడుకోలేని చంద్రబాబు.. ఇంకేం ప్రాజెక్టులు కడతారని ఆయన ఎద్దేవా చేశారు.