తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.

Last Updated : Mar 25, 2018, 04:53 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు.  భద్రాచలం, ఒంటిమిట్టతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సీతారాముల కల్యాణాన్ని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
 
భద్రాచలంలో: అభిజిత్ లగ్నమున సీతారాములవారి కల్యాణానికి భద్రగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 26న జరిగే స్వామివారి కల్యాణం కోసం భద్రాచలం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శ్రీ రామనవమిని పురస్కరించుకుని భద్రాద్రికి భక్తుల రాక ముందే ప్రారంభమైంది. నవమి సందర్భంగా రామాలయాన్ని విద్యుద్దీపాలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరించారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది.

ఒంటిమిట్టలో: కడప జిల్లా ఒంటిమిట్ట  కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవిరాట్‌లకు పంచామృత సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి అనంతరం స్వామివార్లను పట్టుపీతాంబరాలతో అలంకరించారు.ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆశీనులను చేయించి  వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో సంప్రోక్షణ చేశారు. గణపతి పూజ, స్వస్తిపుణ్యవాచనం నిర్వహించారు. యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామన నవమి సందర్భంగా స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Trending News