ఆధార్ కార్డ్ చట్టబద్ధతపై అత్యున్నత ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఆధార్ ఫార్మూలాతో ఏకీభవిస్తూనే కొన్నింటికి తప్పరిసరికాదని తీర్పు వెలువరించింది. ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. తీర్పుకు దీనికి సంబంధించిన 40 పేజీల ప్రతిని జస్టిస్ ఏకే సిక్రి చదివి వినిపించారు.
జస్టిస్ ఏకే సిక్రి :
ఆధార్ జాతీయ గుర్తింపు కార్డు అన్న ధర్మానం.. దీనితో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని అభిప్రాయపడింది. ఆధార్ వల్ల పేదల సాధికారిత వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. ఆధార్ కార్డు రాజ్యాంగబద్ధమైనదని ఆయన స్పష్టంచేశారు.
వీటికి 'ఆధారే ఆధారం'
* ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయవచ్చు..
* ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించవచ్చు.
* ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించడం తప్పనిసరి
వీటికి ఆధార్ అవసం లేదు..
ఆధార్ కార్డు ఫార్ములాతో ఏకీభవిస్తూనే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దేశంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన వారు ఆధార్ లబ్దిని పొందకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. ప్రైవేటు సర్వీసులు తప్పనిసరికాదని ఈ సదర్భంగా కోర్టు అభిప్రాయపడింది. బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లు, మొబైల్ నంబర్లను అనుసంధానం అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది. ఇలా చేసినట్లయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది.
* ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు
* బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరికాదు
* మొబైల్ కంపెనీలు ఆధార్ డేటాను కోరడానికి వీల్లేదు
* స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదు
ఆధార్ కు వ్యతిరేకంగా పిటిషన్లు
ఆధార్ కార్డు తప్పని సరి చేయడం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆధార్ కార్డు పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని..ఇది వ్యక్తిగా గోప్యతకు గొడ్డలి పెట్టులా పరిణమిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.వ్యకిగత వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చిక్కితే దుర్వినియోగం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాగే వ్యక్తుల వేలి ముద్రలు, కనుపాపలు తదితర బయోమెట్రిక్ సమాచారంతో కూడిన ఆధార్‌ను తప్పనిసరి చేయరాదని పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 27 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సుదీర్ఘకాలం పాటు విచారించిన సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది.