ఇంకొన్ని గంటల్లోనే తీవ్రరూపం దాల్చనున్న ఫణి తుపాన్

ఇంకొన్ని గంటల్లోనే తీవ్రరూపం దాల్చనున్న ఫణి తుపాన్

Last Updated : Apr 28, 2019, 04:58 PM IST
ఇంకొన్ని గంటల్లోనే తీవ్రరూపం దాల్చనున్న ఫణి తుపాన్

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తుపాన్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాయువ్యం దిశగా కదులుతున్న తుపాన్ రానున్న 12 గంటల్లో తీవ్రరూపం దాల్చి ఆ తర్వాత రానున్న 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఫణి తుపాన్ చెన్నైకి ఆగ్నేయ దిశలో 1,110 కిమీ, మచిలీపట్నంకు ఆగ్నేయ దిశలో 1,300 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఈ తుపాన్ ప్రభావం కారణంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చెరి, కేరళలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో 90-100 కిమీ నుంచి 115 కిమీ వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే తమిళనాడు, పుదుచ్చెరి తీరప్రాంతాల్లో ఈ గాలుల వేగం 30-40 కిమీ నుంచి 50 కిమీ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఏప్రిల్ 29 నుంచి తమిళనాడు, పుదుచ్చెరి, దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో సముద్రం తీవ్రరూపం దాల్చనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతోపాటు శ్రీలంక దిశలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే సముద్రం మధ్యలోకి వేటకు వెళ్లిన జాలర్లు ఆదివారంలోగా తిరిగొచ్చేయాల్సిందిగా అధికారులు సూచించారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీజిఎస్, వాతావరణ కేంద్రాలు ఎప్పటికప్పుడు తుపాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు, సూచనలు జారీచేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

Trending News