హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు మొత్తం రూ. 5,785 కోట్లు రావాల్సి ఉందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం చూస్తోంటే... దొంగే దొంగ అని అన్నట్టుంది అని ప్రభాకర్ రావు ఏపీ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సింది పోయి.. తెలంగాణే ఏపీకి ఇవ్వాల్సింది ఉన్నట్టు ఉల్టా మాట్లాడుతోంది అని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణపై ఆరోపణలు చేసే ముందు ఏపీ సర్కార్ ఒకసారి ఆలోచించి, రిపోర్టును సరి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని ఏపీ సర్కార్‌కి ఆయన హితవు పలికారు.
విద్యుత్ సంస్థల బకాయిల విషయంలో ఎన్ని లేఖలు రాసినప్పటికీ.. బకాయిలను పరిష్కరించుకోకుండా లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం వెనుక ఏపీ జెన్కో ఆంతర్యం ఏంటనుకోవాలి అని ప్రభాకర్ రావు ప్రశ్నించారు.