నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ; పోలవరం వివాదం సద్దుమణిగేనా ?

పోలవరం ప్రాజెక్టు విషయంలో గుత్తేదారుల అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు  గడ్కరీతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. 

Last Updated : Dec 13, 2017, 05:49 PM IST
నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ; పోలవరం వివాదం సద్దుమణిగేనా ?

పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలక అంశాలు పరిష్కరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతున్నారు. గుత్తేదారు ఆర్ధిక సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యమౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇవాళ భేటీ జరుగుతోంది. ఈ చర్చలో పరిష్కారం దొరికితే పోలవరం పనులు సాఫీగా ముందుకు కదులుతాయి..లేదంటే అంతే సంగతులు...

కేంద్రంతో తాడో పేడో..

పది రోజుల వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు అంశంపై జరుగుతున్న రెండో భేటీ ఇది. ఈ నెల 5న కేంద్ర మంత్రి గడ్కరీతో ఏపీ మంత్రి దేవినేని, జలవనరులశాఖ కార్యదర్శి  భేటీ అయ్యారు. గుత్తేదారు ఆర్ధిక సమస్యల కారణంగా పనులు ముందు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నామని..ఏదైనా ఉంటే కమిటీతో చర్చించాలని కేంద్ర మంత్రి సూచించారు..అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. దీనిపై అధ్యయనం చేసిన కమిటీ గుత్తేదారుతో కుదుర్చుకున్న ఒప్పందం, ఈపీసీ విధానం, అందులోని నిబంధనల ప్రకారం రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా క్లెయిమ్‌ల పరిష్కారం వంటి వాటిపై దృష్టి  సారించడమే మార్గంగా అభిప్రాయపడింది.కాగా కమిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలిపారు. దీంతో చంద్రబాబు ఈ విషయంలో కేంద్రంతో తేల్చుకుందామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గడ్కరీతో భేటీ అవుతున్నారు...

అసలు  సమస్య ఇది..

సాంకేతిక అంశాల కంటే ఆర్ధిక అంశాలే పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకులుగా మారాయి. ప్రాజెక్టు పనులు చేపట్టిన గుత్తేదారులు ఇక్కడ అనేక కారణాల వల్ల ఆర్ధికంగా నష్టపోతున్నామని.... తమ డిమాండ్లు లేదా క్లెయిమ్‌లు వెంటనే పరిష్కారించాలనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఈ అంశాలను పరిష్కరించకుండా కొత్త గుత్తేదారులను తీసుకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వీరు గనుక కోర్టు వరకు వెళ్లితే..ప్రాజెక్టు పనులు మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఎన్నికల నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది.

ఒకవైపు వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో కేంద్రం ప్రభుత్వం గుత్తేదారులకు ఇస్తున్న రాయితీలు వెనక్కి తీసుకోవాలని కోరుతుంటే..మరోవైపు రాయితీలు వెనక్కి తీసుకుంటే తాము న్యాయపోరాటం చేస్తామని గుత్తేదార్ల బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయంలో ఎటూ తెల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కారు.. గుత్తేదారుల సమస్యను పరిష్కరిస్తే సరి..లేకుంటే ప్రాజెక్టు పనుల బాధ్యత కేంద్రానికి అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీతో జరిగే భేటీ కీలకంగా మారింది.

Trending News