జగ్గంపేటలో జరిగిన వైసీపీ సమావేశంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జగ్గంపేట వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సభలో మాట్లాడుతూ..వైసీపీ అధికారంలోకి రావాలంటే జ్యోతుల నెహ్రుని గెలిపించాలని కోరారు. ఆ మాటను ఆయన పదే పదే అన్నారు. దీంతో అక్కడున్న వారందరూ అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే జ్యోతుల నెహ్రు గతంలో వైసీపీ నేతగా గెలిచి కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతం కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. మరీ ఆ టీడీపీ నేతను గెలిపించమని సుబ్బారెడ్డి ఎందుకు కోరుతున్నారా? అని వైసీపీ కార్యకర్తలు అందరూ అయోమయంలో పడిపోయారు.
ఆ తర్వాత మరో వైసీపీ నాయకుడు అనంతబాబు కూడా ప్రసంగిస్తూ.. జ్యోతుల నెహ్రును గెలిపించాలని కోరారు. దీంతో కార్యకర్తలు మళ్లీ కంగుతిన్నారు. అయితే ఈలోపు ఎవరో వెళ్లి సుబ్బారెడ్డికి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్న వైసీపీ నేత పేరు జ్యోతుల నెహ్రు కాదని.. ఆయన పేరు జ్యోతుల చంటిబాబు అని చెప్పడంతో ఆయన మళ్లీ వివరణ ఇచ్చారు. ఇద్దరు ఇంటి పేర్లు ఒకటే కావడంతో కన్ఫ్యూజ్ అయ్యామని.. జ్యోతుల చంటిబాబుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
చిత్రమేంటంటే.. జ్యోతుల చంటిబాబు కూడా ఒక్కప్పుడు టీడీపీ నేతగా ఉండేవారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఉండే ఆయన గత సంవత్సరం టీడీపీకి రాజీనామా చేశారు. జగ్గంపేటలో వైసిపి ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు టిడిపి తీర్థం పుచ్చుకున్న తర్వాత జ్యోతుల చంటిబాబు వైసీపీ కోఆర్డినేటరుగా వ్యవహరిస్తున్నారు. ఇక జ్యోతుల నెహ్రు విషయానికి వస్తే.. గతంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయన అనుయాయులు భావించారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు.