MLC Ananthababu: మావోయిస్టులు హెచ్చరించినా మారలే... మన్యంలో అనంతబాబువి అన్ని అక్రమాలే..!

MLC Ananthababu: అనంతబాబుపై గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ నమోదైంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాకా.. అనంతబాబుపై రౌడీషీట్ ఎత్తేశారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులకు ఆయనకు భయపడుతారని తెలుస్తోంది. వైసీపీ నేతలు కూడా ఆయన చెప్పినట్లు వినాల్సిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 10:37 AM IST
  • ఒక్కొక్కటిగా వెలుగులోనికి అనంతబాబు అక్రమాలు
  • మన్యంలో అనంతబాబు అవినీతి సామ్రాజ్యం
  • గతంలో అనంతబాబును హెచ్చరించిన మావోలు
MLC Ananthababu: మావోయిస్టులు హెచ్చరించినా మారలే... మన్యంలో అనంతబాబువి అన్ని అక్రమాలే..!

MLC Ananthababu: అధికార పార్టీ ఎమ్మెల్యే.. తన కారు డ్రైవర్ ను హత్య చేయడం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్సీనే స్వయంగా కొట్టి చండపం దుమారం రేపుతోంది. కారు డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబును ఎట్టకేలకు కాకినాడ పోలీసులు  అరెస్ట్ చేశారు. తానే హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు అనంతబాబు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఘటన తర్వాత అనంతబాబు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. మన్యంలో ఆయన అరాచకాలకు హద్దే లేదని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ అనంతబాబుది ప్రస్తుతం రంపచోడవరం కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం. ఆ ఏరియాలో ఆయన చెప్పిందే వేదం. మన్యం ప్రాంతంలో  ఏది జరగాలన్న ఆయనదే నిర్ణయం.. ఆయనకు తెలియకుండా చీమకూడా చిటుక్కుమనలేని పరిస్థితి. అధికారులంతా ఆయనకు జీ హుజూర్ అనాల్సిందేనని తెలుస్తోంది. మన్యంలో అత్యంత ఖరీదైన రంగురాళ్ల వ్యాపారం అంతా అనంతబాబు కనుసన్నలోనే సాగుతుంది. అక్రమంగా కలప రవాణా, అడ్డగోలుగా మట్టి తవ్వకాలు, ఇసుక తరలింపు.. ఇలా అన్ని అక్రమ దందాలే. ఈ ప్రాంతంలో అనంతబాబు అనుచరుల చేతిలోనే పేకాట శిబిరాలు నడుస్తున్నాయని చెబుతున్నారు.రంపచోడవరం డివిజన్‌లో ఎక్కడ చూసినా అనంతబాబు అక్రమ బాగోతాలే కన్పిస్తున్నాయి. అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో అనంతబాబు బినామీల పేరిట మెటల్‌ క్వారీలు, చేపల చెరువులు నడుస్తున్నాయిని సమాచారం. గంజాయి సాగు, అక్రమ రవాణా కూడా అనంతబాబు డైరెక్షన్ లోనే సాగుతుందని చెబుతున్నారు. ఏజెన్సీలో పనులు చేసే కాంట్రాక్టర్లు ఆయనకు వాటా ఇచ్చాకే పనులు మొదలుపెడతారనే టాక్ ఉంది.

అనంతబాబుపై గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ నమోదైంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాకా.. అనంతబాబుపై రౌడీషీట్ ఎత్తేశారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులకు ఆయనకు భయపడుతారని తెలుస్తోంది. వైసీపీ నేతలు కూడా ఆయన చెప్పినట్లు వినాల్సిందే. అందుకే ఆయన ఏం చేసినా అక్కడ అడిగేవారు లేరు. దీంతో మన్యంలో అవినీతి కోటను అనంతబాబు నిర్మించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనంతబాబు తండ్రి అనంత చక్రరావు గతంలో రంప చోడవరం సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు. గిరిజనులను వేధించారనే ఆరోపణలు ఉండటంతో.. అతన్ని మావోయిస్టులు కాల్చి చంపారు. అనంతబాబును కూడా మావోయిస్టులు చాలా సార్లు హెచ్చరించారు. జడ్పీటీసీగా ఉన్నప్పుడు.. ఓసారి ఎత్తుకెళ్లి ప్రజాకోర్టు నిర్వహించి గిరిజనుల జోలికి రావొద్దని హెచ్చరించి పంపించారు. మావోయిస్టులు హెచ్చరించినా  అల్లూరి జిల్లాలో అనంతబాబు అక్రమాలు మాత్రం ఆగలేదు. అధికారం వచ్చారా మరింతగా శృతి మించాయని అంటున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన అనంతబాబు సామాన్య కార్యకర్త నుంచి అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీ స్థాయికి వచ్చారు. 1998లో కాంగ్రెస్‌లో కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన అనంతబాబు.. 2001లో తూర్పుకాపు కోటాలో అడ్డతీగల జడ్పీటీసీగా గెలిచారు. 2006లో కొండ కాపుగా  ఎస్టీ సర్టిఫికేట్ తో అడ్డతీగల ఎంపీపీ అయ్యారు. వైసీపీ ఆవిర్భావంతోనే  ఆ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఎస్టీ సర్టిఫికేట్ తో రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే అనంతబాబు ఎస్టీ కాదని.. పోటీదారులు ఆధారాలు తీసుకురావడంతో రిటర్నింగ్ అఫీసర్ అనంతబాబు నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో అతనికి నామినీగా ఉన్న వంతల రాజేశ్వరి వైసీపీ అభ్యర్థి అయ్యారు. ఆమె 2014 ఎన్నికల్లో గెలిచారు. రాజేశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నా.. అధికారమంతా అనంతబాబుదే. ఎమ్మెల్యే రాజేశ్వరి ఏటీఎం కార్డు అనంతబాబు దగ్గరే ఉండేదని.. ఆమెకు వచ్చే గౌరవ వేతనం కూడా  తీసుకునేవాడని అప్పట్లో ప్రచారం జరిగింది. 2017లో రాజేశ్వరి టీడీపీలో చేరారు. అనంతబాబు అరాచకాలు భరించలేకే ఆమె పార్టీ మారారనే ప్రచారం ఉంది.

ఇక 2019లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అనుచరులు రాలిగా ఉన్న నాగులపల్లి ధనలక్ష్మిని నిలబెట్టి గెలిపించారు అనంతబాబు. నియోజకవర్గంలో ఇప్పుడు ధనలక్ష్మి కూడా డమ్మీగానే మారిపోయింది. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా.. ఎమ్మెల్యే ముందు అనంతబాబును కలవాల్సిందే. అధికారులు కూడా ఎమ్మెల్యేను అసలే పట్టించుకోరని.. అంతా ఎమ్మెల్సీ భజనే చేస్తారని తెలుస్తోంది. హత్య కేసులో అనంతబాబు అరెస్ట్ కావడంతో మన్యంలో ఆయన చేసిన అక్రమాలు, అరాచకాలు వెలుగులోనికి వస్తున్నాయి. బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. రాబోయే రోజుల్లో అనంతబాబు అక్రమాలు మరిన్ని వెలుగులోనికి వస్తాయని అంటున్నారు.

READ ALSO: JAGAN KTR MEET: గల్లీలో కుస్తీ.. దావోస్ లో దోస్తీ! జగన్, కేటీఆర్ భేటీపై రాజకీయ రచ్చ..

READ ALSO: MLC Anantha Babu: డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటీ! 20 వేల కోసం ఎమ్మెల్సీ చంపేస్తాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News