Budget 2023 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది బడ్జెట్ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరి నోట బడ్జెట్‌కి సంబంధించిన టాపిక్స్ వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.
బడ్జెట్ చరిత్ర ఏంటి ?
బడ్జెట్ అనే పదం బౌజ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. బౌజ్ అంటే లెదర్ బ్యాగ్ అని అర్థం. బౌజ్ అనే పదం ఆ తరువాతి క్రమంల ఫ్రెంచ్‌లో బౌగెట్‌గా మారింది. బౌగెట్ అంటే లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్థం. బడ్జెట్ డాక్యుమెంట్స్, ముఖ్యంగా ఆదాయానికి సంబంధించిన రసీదులు, వ్యయానికి సంబంధించిన పత్రాలు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగం ప్రతులు వంటివి బ్రౌన్ బ్రీఫ్‌కేస్‌లో తీసుకువెళ్లే వారు. ఇది బ్రిటీష్ కాలం నుంచి వస్తోన్న సంప్రదాయం.
స్వతంత్ర భారతావనిలో తొలి బడ్జెట్
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. అయితే, ఇండియాలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిగా మాత్రం మొట్టమొదటి రైల్వే మంత్రిగా దేశానికి సేవలు అందించిన ఆర్థికవేత్త జాన్ మథాయ్ పేరు గడించారు. 1950 ఫిబ్రవరి 28 న జాన్ మథాయ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌తో పాటు మధ్యంతర బడ్జెట్ అనే పదాలు 1948 - 49 కాలంలో మొదటిసారిగా ఉపయోగించారు.
మొదటిసారిగా మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్
1970లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా ఇందిరా గాంధీ చరిత్రకెక్కారు. దేశ ప్రధాన మంత్రిగా, ఆర్థిక శాఖలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారు.
అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేత ఎవరంటే..
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. మొరార్జి దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అందులో ఆరుసార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో, మరో నాలుగుసార్లు ఉప ప్రధాని హోదాలో ఉన్నారు. ఇందులో రెండు మధ్యంతర బడ్జెట్లు కూడా ఉండటం గమనార్హం.
అలాట్ చేసిన బడ్జెట్ మరో బడ్జెట్ కంటే ముందే అయిపోతే..
ప్రతీ ఏడాది పరిపాలన, ప్రజా సంక్షేమ అవసరాల ఖర్చుల కోసం కేటాయించిన మొత్తం ఒకవేళ ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పూర్తయినట్టయితే అప్పుడు ఏం చేస్తారు ? ఇలాంటి సందేహం ఎప్పుడైనా వచ్చిందా ? దానికి ఓ పరిష్కార మార్గం ఉంది. ఖర్చుల కోసం సప్లిమెంటరీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు మొత్తాన్ని కేటాయించడం జరుగుతుంది. సాధారణ బడ్జెట్‌ని ఎలాగైతే రూపొందిస్తారో.. సప్లిమెంటరీ బడ్జెట్‌ను కూడా అలాగే తయారు చేస్తారు.