CIBIL Score Myths And Facts: సిబిల్ స్కోర్ గురించి అపోహలు, నిజాలు

CIBIL Score Myths And Facts: ఒక వ్యక్తికి యూనివర్శల్‌గా ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుందా ? అసలు క్రెడిట్ స్కోర్ .. క్రెడిట్ రిపోర్ట్ .. రెండూ ఒక్కటేనా ? పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా ? రుణం చెల్లించినంత మాత్రాన్నే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ? ఇలాంటి సందేహాలు మీకు కూడా ఎప్పుడైనా కలిగాయా ? అయితే సమాధానాలు ఇదిగో.. 

Written by - Pavan | Last Updated : Sep 29, 2023, 08:11 PM IST
CIBIL Score Myths And Facts: సిబిల్ స్కోర్ గురించి అపోహలు, నిజాలు

CIBIL Score Myths And Facts: ఒక వ్యక్తికి ఆధార్ కార్డు తరహాలో యూనివర్శల్‌గా ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుందా ?
ఒక వ్యక్తికి ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి క్రెడిట్ స్కోర్ అనేది ఆ క్రెడిట్ స్కోర్‌ని లెక్కించే కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్ స్కోర్ లెక్కించడానికి నాలుగు రకాల సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటి ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కాగా రెండోది ఈక్వీఫాక్స్ , మూడోది ఎక్స్‌పీరియన్ , నాలుగోది క్రిఫ్ హై మార్క్. ఈ నాలుగు సంస్థలు వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ని లెక్కిస్తుంటాయి. అయితే, ఒక్కో బ్యాంకు ఒక్కో సంస్థతో ఒప్పందం కలిగి ఉంటాయి. అలాగే వారు ఇచ్చే క్రెడిట్ స్కోర్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుంటాయి.

క్రెడిట్ స్కోర్ .. క్రెడిట్ రిపోర్ట్ .. రెండూ ఒక్కటేనా ?
క్రెడిట్ స్కోర్ , క్రెడిట్ రిపోర్ట్ .. ఈ రెండూ ఒక్కటేనా అని చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. కానీ వాస్తవానికి చూడ్డానికి పేర్లూ ఒకేలా ఉన్నప్పటికీ ఈ రెండూ వేర్వేరు. క్రెడిట్ స్కోర్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 300 నుండి 900 మధ్య ఉండే మూడు అంకేల స్కోర్. ఇది కేవలం స్కోర్ ని మాత్రమే సూచిస్తుంది. కానీ క్రెడిట్ రిపోర్ట్ అంటే.. మీ చిరునామా, గతంలో తీసుకున్న రుణాలు, వాటిని చెల్లించిన తీరు, ఇంకా చెల్లించకుండా ఏమైనా పెండింగ్ లోన్స్ ఉన్నాయా ? అనే వివరాలను అన్నింటిని వడపోసి ఆర్థికంగా మీ మొత్తం జాతకం తీసి బ్యాంకుల ముందు పెడుతుంది.

పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా ?
పదే పదే లేదా తరచుగా క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది అనే భావన చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి అదొక అపోహ మాత్రమే. పైగా ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల.. అందులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దుకుని క్రెడిట్ స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. మీకు మీరే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకవేళ తరచుగా మీరు రుణం కోసం దరఖాస్తు చేసి అంతే తరచుగా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసినట్టయితే.. అలాంటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడమే కాకుండా మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

రుణం చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ?
రుణం చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అనేది వాస్తవమే అయినప్పటికీ.. ఇది ఎక్కువగా క్రెడిట్ కార్డుల విషయంలోనే అధికంగా వర్తిస్తుంది కానీ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ వంటి రుణాల విషయంలో కాదు. ఎందుకంటే కేవలం రుణం చెల్లించడం వల్లే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అని అనుకోవడం సరికాదు. ఎక్కువ క్రెడిట్ ఎకౌంట్స్ కలిగి ఉండి వాటిని ఆర్థిక క్రమశిక్షణతో ఉపయోగిస్తూ సకాలంలో రీపేమెంట్స్ చేసినప్పుడు మాత్రమే క్రెడిట్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

Trending News