Why RBI Decided to Withdraw Rs 2000 Notes : రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనియాంశమైంది. జనం వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చని... లేదంటే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టంచేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా 2 వేల నోట్ల డిపాజిట్ లేదా నోట్ల మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. నేడు కేంద్రం నుంచి ఈ ప్రకటన రాగా.. మే 23వ తేదీ నుంచి నోట్ల నగదు మార్పిడి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
బ్యాంకులు తమ కస్టమర్స్‌కి రూ. 2000 నోట్లు జారీ చేయకూడదని.. ఈ క్షణం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. అయితే, జనం మధ్య లావాదేవీల కోసం, చెల్లింపుల కోసం సెప్టెంబర్ 30 వరకు రూ. 2000 నోట్లు ఉపయోగించుకోవచ్చు అని ఆర్బీఐ వెల్లడించింది.
ఇప్పుడు చలామణిలోంచి రూ. 2000 నోటును ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటంటే..
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను ముద్రించడం ఆపేసింది. 2016 నవంబర్‌లో RBI చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 500 నోట్లను, 1000 నోట్లను చట్టబద్ధంగా రద్దు చేసిన తరువాత ఆర్థిక వ్యవస్థలోని కరెన్సీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో కేంద్రం రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు ఇతర డినామినేషన్లలో అవసరాలకు అనుగుణంగా నోట్లు అందుబాటులోకి రావడంతో, 2018-19లో కేంద్రం 2000 నోట్ల ప్రింటింగ్‌ని నిలిపేసింది.
రూ.2000 డినామినేషన్ నోట్లలో 89 శాతం నోట్లను మార్చి 2017కి ముందే జారీ చేసింది. అలా జారీ అయిన నోట్ల జీవిత కాలం కూడా 4 నుంచి 5 ఏళ్లు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, ఇప్పుడు ఆ నోట్ల జీవిత కాలం ముగుస్తుండటంతో పాటు ఇతర డినామినేషన్ కి చెందిన నోట్లు ప్రస్తుతం దేశ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయే మోతాదులో ఉన్నాయి. సరిగ్గా ఈ కారణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా “ క్లీన్ నోట్ పాలసీ ” ప్రకారం 2000 రూపాయల డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టు స్పష్టంచేసింది.