School Girl Dies Of Punishment: బెంగళూరులోని జలహల్లికి సమీపంలోని రామచంద్రాపురంకు సమీపంలోని కోకోనట్ గార్డెన్‌లో ఉన్న ఆర్డీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు టీచర్ పనిష్మెంట్ ఇస్తున్న సమయంలోనే బాలిక కళ్లు తిరిగి పడిపోయింది. చిన్నారి కుప్పకూలి కిందపడటంతో స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
బాలిక మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించడంతో ఇక ఏం చేయలో అర్థం కాని పరిస్థితుల్లో చిన్నారి గురించి స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది.
బుడిబుడి అడుగులేసుకుంటూ స్కూల్‌కి వెళ్లిన చిన్నారి శవమై తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చిన్నారి స్కూల్‌కి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో అర్థం కాని తల్లిదండ్రులు.. స్కూల్ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనిష్మెంట్ ఇచ్చిన కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బాలిక మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్కూల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నించారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు వాస్తవం ఏంటో తెలిసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు.
చిన్నారి కుప్పకూలిన తర్వాత ఆమెకు గమనించడంలో ఆలస్యం చేశారా లేక చిన్నారిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల సందేహాలకు, పోలీసుల అనుమానాలకు పోస్టుమార్టం నివేదికే సమాధానం చెప్పనుంది.