Black Magic in Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చిన్నారతపల్లి - మొట్లపల్లి గ్రామాల మధ్య రహదారి మూలపై రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు , కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో, క్షుద్ర పూజ చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్షుద్ర పూజలకు పంది పిల్లను బలి ఇవ్వడంతో అటువైపు వెళుతున్న ప్రయాణికులు గ్రామస్తులు అది చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం, బుధవారం వచ్చిందంటే చాలు గ్రామ కూడల్లో క్షుద్ర పూజలు దర్శనం ఇవ్వడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఏదేమైనా మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న సామెత చందంగా.. క్షుద్రపూజలు చేసి ప్రతిఫలం పొందొచ్చు అనుకోవడం ఉత్తి మూఢ నమ్మకం మాత్రమే కానీ అందులో ఏ మాత్రం వాస్తవం ఉండదు అనే విషయం జనం మర్చిపోకూడదు. ఓవైపు శాస్త్ర పరిశోధన రంగంలో చంద్రయాన్ లాంటి అద్భుతాలు సాధిస్తోంటే మరోవైపు గ్రామాల్లో ఇప్పటికీ చేతబడి, క్షుద్రపూజలు అంటూ ఏవేవో ప్రచారాలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి మూడ నమ్మకాలను నమ్మొద్దు అని ఓవైపు జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాటిపై నమ్మకాలు, భయం పోకపోవడం దురదృష్టకరమైన పరిణామంగా చూడొచ్చు.
గతంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారు మామిడితోటలో క్షుద్రపూజలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. 10 అడుగుల మనిషి ఆకారంలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో బోమ్మ గిసి క్షుద్రపూజల చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. మనిషి ఆకారంలో గీసిన బొమ్మ వద్ద ఓ మనిషికి సంబందించిన ఫ్యాంట్, షర్ట్, బనియన్‌తో పాటు ఎముకలు, రెండు నళ్ళ కోళ్ళను చంపి అక్కడ పడి వేశారు. కోడి గుడ్లు, గుమ్మడికాయ పగలకొట్టి క్షుద్రపూజలు చేసిన అనవాళ్లు ఉన్నాయి.
ఆదివారం ఉదయం అటువైపు పశువులు మేపుకునేందుకు వెళ్లిన పశువుల కాపారులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఈ క్షుద్రపూజల వైనం వెలుగుచూసింది. తమ గ్రామ శివార్లలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్త ఆ ఊరిలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దావానంలా వ్యాపించింది. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా, సినిమాల్లో చూసిన తరహాలో క్షుద్రపూజలు జరిగిన తీరు చూసి స్థానికులు భయాందోళనలకు గురిచేసింది.