Bhola Shankar Movie Tickets: ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. రేపు విడుదల కానున్న చిరంజీవి సినిమా భోళాశంకర్‌పై పడుతోంది. సినిమా టికెట్ల పెంపుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వివాదం మరింత పెరుగుతోంది. అయితే ఈ రెండింటికీ సంబంధం లేదంటున్నారు మంత్రి వేణు గోపాల కృష్ణ. పూర్తి వివరాలు మీ కోసం..
వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు మంత్రులు ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా..తాజాగా విజయసాయిరెడ్డి గట్టిగానే సమాధానమిచ్చారు. మరోవైపు చిరు నటించిన భోళాశంకర్ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా టికెట్లు పెంచుకునేందుకు అనుమతించాల్సిందిగా చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవనే కారణంతో అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా కోరింది.
వాస్తవానికి ఈ పద్ధతి ఇప్పటికే అమల్లో ఉన్నదే. చిరంజీవి సారధ్యంలో సినీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపి సాధించుకున్న నిబంధనలే. సినిమా టికెట్లు పెంచుకోవల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలకే టికెట్ల పెంపుకు అనుమతి ఉంటుంది. భోళాశంకర్ సినిమా 101 కోట్లతో నిర్మితమైందని చిత్ర నిర్మాతలు చెప్పారు. కానీ దీనికి సంబంధించి సమర్పించాల్సిన జీఎస్టీ, బ్యాంక్ స్టేట్‌మెంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్, షూటింగ్ ఇన్ ఏపీ వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ 12 అంశాలపై చిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి వివరాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి టికెట్ల పెంపుకు అనుమతిస్తుంది. కానీ చిత్ర నిర్మాతలు ఆ వివరణ ఇవ్వలేదు. ఇప్పటివరకూ వాటిని సమర్పించకపోవడంతో ఇక అనుమతి లేనట్టేనని తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ జరిపినట్టుగా నిర్మాతలు ఆధారాలు సమర్పించలేని ప్రభుత్వం తెలిపింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే టికెట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చే అంశం పరిశీలిస్తామని వెల్లడించింది. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాకు ఈ వివరాలు ఇవ్వడం వల్లనే టికెట్లు పెంచుకునేందుకు అనుమతించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే కొందరు ఈ అంశాన్ని ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో ముడిపెడుతున్నారని..ఇది పూర్తిగా తప్పని మంత్రి వేణుగోపాల కృష్ణ సమాధానమిచ్చారు. ప్రభుత్వంపై కామెంట్లు చేయడం వల్లనే చిరంజీవి సినిమాకు టికెట్లు పెంచుకునే అనుమతి లభించలేదని చెప్పడం అవాస్తవమన్నారు. ఎవరి ప్రేరణతో ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారో అంతా తెలుసన్నారు. సినిమాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారో కూడా తెలుసన్నారు. భోళాశంకర్ సినిమాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం మానుకోవాలని మంత్రి వేణుగోపాల్ కృష్ణ సూచించారు.
Also read: Vijayasai Reddy: చిరు వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం, మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook