జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి, హింస ఘటనల అనంతరం బాధిత విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ దీపికా పదుకునె ఇటీవల జేఎన్‌యూకు వెళ్లడం ఎంత చర్చనియాంశమైందో అందరికీ తెలిసిందే. జేఎన్‌యూలో దాడి వెనుక ఎవరున్నారనే చర్చల నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఆ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి వారిని పరామర్శించడం పతాకశీర్షికలకెక్కింది. ఇదే విషయమై తాజాగా బాలీవుడ్‌కే చెందిన మరో ప్రముఖ నటి కంగనా రనౌత్ స్పందిస్తూ.. మన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా.. ఎలాగైనా స్పందించే హక్కు ఉందని, అందుకే దీపికా తనకు తోచిన అభిప్రాయాన్ని తాను వినిపించిందని వ్యాఖ్యానించింది. తాజాగా స్పాట్‌బోయ్ అనే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన కంగనా రనౌత్... ''దీపికా పదుకునే తీసుకున్న నిర్ణయంగా ఆమె వ్యక్తిగతం అని అన్నారు. దీపికా పదుకునె నిర్ణయంపై తాను స్పందించడం సరైంది కాదు కానీ.. తాను మాత్రం దేశాన్ని విడదీసే తుక్డె తుక్డే గ్యాంగ్‌కి మద్దతు ఇవ్వబోనని... దేశాన్ని విడదీసే శక్తులకు తాను వ్యతిరేకం'' అని స్పష్టంచేసింది. సైనికుడు చనిపోతే వేడుకలు చేసుకునే వారికి తానెప్పుడూ అండగా నిలవబోనని కంగనా రనౌత్ పేర్కొంది.
Read also : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా దీపికా పదుకొనే
దీపికా పదుకునే జేఎన్‌యూకి వెళ్లినందువల్లే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ చపాక్ సినిమా వసూళ్లు భారీగా తగ్గాయని వ్యక్తమవుతున్న అభిప్రాయాలపైనా కంగనా రనౌత్ తనదైన స్టైల్లో స్పందించింది. వివాదం వల్లే సినిమా విజయం సాధించలేదంటే తాను ఒప్పుకోనని.. సరైన కథాంశం ఉన్న సినిమా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. అంతేకాదు... సినిమా బాగుంటే.. శత్రువులు కూడా వెళ్లి సినిమా చూస్తారని కంగనా రనౌత్ అభిప్రాయపడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..