సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించాడు కత్తి మహేశ్. అంతేకాదు.. పవన్ కల్యాణ్ అభిమానులు తనపై ఇలా దాడి చేయడం ఆపకపోతే, అతడికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేయడానికైనా తాను సిద్ధంగా వున్నానని కత్తి మహేష్ తేల్చిచెప్పాడు. కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సందర్భంగా కత్తి మహేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తన అభిమానులని ఇతరులపైకి ఉసిగొలిపే వ్యక్తిత్వం గలమనిషి పవన్ కల్యాణ్. అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాడు. అందుకే పవన్ కల్యాణ్ పై ప్రజాస్వామ్యయుతంగానే పోరాడి ఓడించాలని నిర్ణయించుకున్నట్టు కత్తి మహేశ్ అభిప్రాయపడ్డాడు. సామాన్య పౌరుడినైన తనకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే హక్కు ఉంది కనుక అతడిపై పోటీకి వెనుకాడబోనని కత్తి మహేష్ పేర్కొన్నాడు.
"పవన్ కల్యాణ్ అభిమానులు అతడిని ఆరాదిస్తూ ఓరకమైన బానిస మనస్తత్వంతో బతికేస్తున్నారు. ఓవైపు గత నాలుగు నెలలుగా తాను తన హక్కుల కోసం, వ్యక్తిత్వం కోసం, అస్థిత్వం కోసం పోరాడుతుంటే పవన్ కల్యాణ్ అభిమానులకి ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదో తనకైతే అస్సలు అర్థం కావడం లేదు" అని టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆవేదన వ్యక్తం చేశాడు కత్తి మహేశ్. భారీ అభిమాన బలగం కలిగిన పవన్ కల్యాణ్‌పై పోటీకైనా వెనుకాడబోనని కత్తి మహేష్ స్పష్టంచేయడాన్ని పవన్ కల్యాణ్ అభిమానులు ఎలా స్పందించనున్నారో మరి!!