k Vishwanath's Death News: తెలుగు సినిమాకు అడుగులు నేర్పించిన అతి కొద్దిమంది సినీ ప్రముఖులలో కళాతపస్వి ముందుంటారు. కళామతల్లి ముద్దు బిడ్డ అనే పదానికి అసలు రూపం ఆయన. " సినిమా అంటే కేవలం కమెర్షియల్ వ్యాల్యూస్, హంగూ ఆర్బాటాలు మాత్రమే కాదని.. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కళలకు ప్రతిరూపం " అని తన సినిమాలతో నిరూపించిన మహా రిషి కే విశ్వనాథ్. అందుకే ఆయన్ని సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
తెలుగు సినిమా చేసుకున్న మహా భాగ్యం కే విశ్వనాథ్ లాంటి బహుముఖప్రజ్ఞాశాలి మన చిత్ర సీమలో పుట్టడం. కే విశ్వనాథ్ చిత్రాల్లో భూతద్దం పెట్టి వెతికినా వ్యాపార దృక్పథం ఏ మాత్రం కనిపించదు. తన ప్రతీ చిత్రం సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ధృఢ సంకల్పంతోనే ముందుకు సాగిన ధైర్య సాహసి కే విశ్వనాథ్. ముఖ్యంగా సమాజంలో ఒక భాగమైన కళలను ప్రోత్సహించాలన్న తన ఆశయాన్ని ఆది నుంచి అంతం వరకు కొనసాగించిన యోగి కే విశ్వనాథ్. సినీ ప్రపంచంలో ఎంతో మందికి గురువుగా, ఎక్కడా అశ్లీలం, అసభ్యానికి తావులేకుండా విలువలతో కూడిన చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కే విశ్వనాథ్ మృతి నిజంగానే తెలుగు సినిమాకు తీరని లోటు.