Karthikeya 2 Review: సూపర్ హిట్ కార్తికేయ సీక్వెల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review in Telugu : నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 12:49 PM IST
Karthikeya 2 Review: సూపర్ హిట్ కార్తికేయ సీక్వెల్ సినిమా ఎలా ఉందంటే?

నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో సినిమాకు సీక్వెల్ తర్కెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ 2 2022లో విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. కానీ థియేటర్ల సమస్యతో అనేకసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సహా కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ధియేటర్లలో విడుదలైంది. తమిళంలో కేవలం డిజిటల్ రిలీజ్ కాబోతోంది. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడం కార్తికేయ 2 సినిమా టీజర్ ట్రైలర్ సహా విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద విపరీతమైన ఆసక్తి రేకెత్తించడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను కార్తికేయ 2 సినిమా అందుకున్నదా లేదా అనేది రివ్యూ లో తెలుసుకుందాం
 
కార్తికేయ కథ ఏమిటంటే?
మొదటి భాగానికి సీక్వెల్ గా తరకెక్కిన ఈ సినిమాలో తన తల్లి(సీత) మొక్కుకున్న ఒక మొక్కు కారణంగా కార్తికేయ(నిఖిల్) ద్వారక వెళ్లాల్సి వస్తుంది. ద్వారక వెళ్ళిన తర్వాత అప్పటికే శ్రీకృష్ణుడి పాద కంకణం కోసం వెతుకుతున్న డాక్టర్ శంతను(ఆదిత్య మీనన్) అలాగే ప్రొఫెసర్ రంగనాథరావు(శ్రీధర్) ఇద్దరికీ కార్తికేయ మోస్ట్ వాంటెడ్ గా మారతాడు. రంగనాథరావు మరణం తరువాత కార్తికేయ శ్రీకృష్ణుడి పాద కంకణాన్ని సాధించే పనిలో పడతాడు. ఆ పనిలో ప్రొఫెసర్ రావు మనవరాలు ముగ్ధ(అనుపమ) తన మామ(శ్రీనివాసరెడ్డి) దారిలో కలిసిన ట్రక్ డ్రైవర్ సులేమాన్(వైవా హర్ష) అతనికి సహాయ పడతారు. కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే దానిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు పాద కంకణాన్ని అందుకున్న ఉద్దవుడు అనేక పరీక్షలు పెట్టి అవి సాధిస్తేనే పాద కంకణం అందేలా ప్లాన్ చేస్తాడు. మరి ఆ కంకణాన్ని కార్తికేయ సాధించాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.
 
విశ్లేషణ:
స్వతహాగా డాక్టర్ అయిన కార్తీక్ దేవుడిని నమ్మడు, అన్నీ కూడా సైన్స్ తో ముడిపడి ఉంటాయని భావిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి చేత కార్తికేయ అనే సినిమా చేయించి సూపర్ హిట్ కొట్టిన చందు మొండేటి దానికి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను సీట్లలో అతుక్కుపోయేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా ప్రారంభంలో కథలోకి తీసుకువెళ్లడానికి కొంత సమయం తీసుకున్న దర్శకుడు ఒకసారి కథలోకి తీసుకువెళ్లాక తరువాత ఏం జరగబోతోంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? అనే విషయం మీద తీవ్ర ఉత్కంఠ రేపుతూ సినిమా క్లైమాక్స్ వరకు నడిపించారు. ఒక రకమైన ట్రెజర్ హంట్ మూవీలా ఆద్యంతం సినిమాని నడిపించాడు దర్శకుడు. చాలా చోట్ల మాత్రం లాజిక్స్ మిస్ అవుతాయి. లాజిక్స్ మిస్ అయినా సరే సినిమా ఆద్యంతం కూడా ప్రేక్షకులు మరో ఆలోచన లోకి కూడా వెళ్లకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. మొదటి భాగం కొంచెం లాగ్ అనిపించినా కథలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రేక్షకులు ఏమాత్రం బోరు ఫీల్ అవ్వరు. కొన్నిచోట్ల లాజిక్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండి ఉంటే ప్రేక్షకులకు ఒక విందు భోజనంలా అనిపించేది. కానీ కొన్నిచోట్ల లాజిక్స్ మిస్ అవ్వడంతో పాటు క్లైమాక్స్లో సరైన కంక్లూజన్ ఇవ్వలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. మూడో భాగానికి హింట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించిన దర్శకుడు రెండో భాగాన్ని సమర్థవంతంగా ముగించడంలో మాత్రం కొంతమేర విఫలం అయ్యాడు. సినిమా ఆద్యంతం కూడా శ్రీకృష్ణుడి పాద కంకణాన్ని సాధించడం అనే విషయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో మన ఊహకి కూడా అందని కొన్ని విషయాలను చొప్పించడంతో నమ్మడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా లాజికల్ గా కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ ఇచ్చే దానికి ప్రయత్నించారు. 
 
నటీనటులు
ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కార్తికేయ సినిమాలో నిఖిల్ ఎలా అయితే తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడో అలాగే రెండో భాగంలోనూ తన సత్తా చూపించాడు. చాలా ఈజ్ తో ఆయన నటన కనిపించింది. ఇక ముగ్ద పాత్రలో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించింది. తన ఉంగరాల జుట్టుతో అందాల ఆరబోతకు దిగకుండా కేవలం కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితమైంది. ఒకే సీన్లో కనిపించిన అనుపమ్ ఖేర్ గూజ్ బంప్స్ తెప్పించేలా డైలాగ్స్ చెప్పారు. ఇక సినిమాలో శంతను అనే పాత్రలో నెగిటివ్ షేడ్స్ పోషించిన ఆదిత్య మీనన్ ఆకట్టుకున్నారు. అలాగే ప్రొఫెసర్ రావు పాత్రలో నటించిన శ్రీధర్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి, వైవాహర్ష కొంతమేర కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే తమ న్యాచురల్ స్టైల్ తో వారిద్దరూనటించారు. ఇక అభీరుల లీడర్ గా నటించిన వ్యక్తి నటన కూడా బాగుంది.. అప్పాజీ అంబరీష, సీత, ప్రవీణ్, సత్య వంటి వారి పాత్రలు చిన్నవే అయినా తమ పరిధి మేర నటించారు.
  
టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఇక ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ వర్క్ గురించి, మొదటి భాగం అలాగే రెండో భాగంలో కూడా ఈ విఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా తమ పనితనాన్ని చూపించాయి. విఎఫ్ఎక్స్ టీం ఒకరకంగా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే ఆర్ఆర్ తో కాలభైరవ, సినిమాటోగ్రఫీతో కార్తీక్ ఘట్టమనేని కూడా మ్యాజిక్ చేశారు. పాటలు తక్కువే కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కాలభైరవ తన పనితనాన్ని చూపించారు. కార్తీక్ ఘట్టమనేని కూడా అద్భుతమైన లొకేషన్ లను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎడిటింగ్ కూడా కార్తీక్ ఘట్టమనేని చూసుకున్నారు అయినా ఎక్కడ వంకపెట్టే విధంగా లేకుండా చూసుకున్నారు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగానే అద్భుతంగా కుదిరాయి. 
 
ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే
ఈ సినిమా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయి అనే విషయం పక్కన పెడితే చిన్న పిల్లల నుంచి కుటుంబంలో పెద్దల వరకు అందరూ కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగిన పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఈ మూవీ.
 
నటీనటులు - నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, KS శ్రీధర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య & హర్ష చెముడు 
దర్శకత్వం - చందూ మొండేటి 
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & అభిషేక్ అగర్వాల్ 
సహ నిర్మాత: వివేక్ కూచిభోట్లా 
సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమ్నేని 
సంగీతం: కాల భైరవ 
 VFX సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరు

కార్తికేయ 2 మూవీ రేటింగ్: 3/5

Also Read: KGF 2: కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. జీ తెలుగులో ఎప్పుడంటే?

Also Read: Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News