Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా ఎలా ఉందో తెలుసా?

Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రమంలో ఆ సినిమా ఎలా ఉందో సినిమా రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 2, 2023, 11:58 PM IST
Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా ఎలా ఉందో తెలుసా?

Rebels Of Thupakula Gudem Movie Review: సినిమాలు చూసే ధోరణి మారిపోవడంతో ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం అనే సినిమా తెరకెక్కింది, వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కించారు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరామ్ రెడ్డి సహా నలభై మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా అందరిలో ఆసక్తి రేకెత్తింది. దానికి తగ్గట్టు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడంతో అందరిలో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అలా ఫిబ్రవరి మూడో తేదీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. 

కథ:
రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా కథ అంతా తుపాకులగూడెం అనే సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నక్సలిజం సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీం ఏర్పాటు చేస్తుంది. దాని ప్రకారం నక్సలైట్లు సరెండర్ అయితే వారికి మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. అలా నక్సలైట్ల పేరుతో ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను సరెండర్ చేయడానికి ఒక బ్రోకర్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయాన్ని ఏజెన్సీ మొత్తం దొరలా ఫీలయ్యే రాజన్న దృష్టికి తీసుకువెళ్తే రాజన్న తన దగ్గర ఉండే కుమార్ అనే వ్యక్తికి ఈ పని అప్పగిస్తాడు. అయితే సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేమని మనిషికి లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు బ్రోకర్.  అలా వందమంది కలిసి కోటి రూపాయలు డబ్బు పోగుచేసుకుని సదరు బ్రోకర్ కి ఇచ్చిన తర్వాత అతను మిస్ అవుతాడు. ఈ 100 మంది గవర్నమెంట్ కి లొంగిపోయి పోలీసులయ్యారా ? నిజంగా వాళ్లకు బ్రోకర్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించాడా? ఈ కథలో శివన్న పాత్ర ఏమిటి? ఊరి బాగు కోసం ప్రయత్నించిన క్రాంతి ఎవరు? మన్యం మొత్తం పెద్దదిక్కుగా భావించే రాజన్నకు- క్రాంతికి- శివన్నకు అసలు సంబంధం ఏమిటి అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ: 
రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా ఆద్యంతం అడవుల నేపథ్యంలో సాగుతుంది. సాధారణంగా ఏజెన్సీల వ్యవహారం అంటే ఎక్కువగా రోడ్డు లేకపోవడం ఇతర ప్రాంతాల వారితో కనెక్టివిటీ లేకపోవడం అనే సమస్యలనే ప్రధానంగా చూపిస్తూ ఉంటారు. ఇందులో కూడా అంతర్లీనంగా కొంత వాటిని చూపించే ప్రయత్నం చేశారు కానీ ఒక 100 మంది అమాయక గిరిజనులను ఒక బ్రోకర్ ఎలా మోసం చేశాడు అనే పాయింట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఊరిని బాగు చేయడం కోసం వెళ్లిన క్రాంతి అనూహ్యంగా మరణించడం, అతని తమ్ముడు రాజన్న తన అన్న చావుకి కారణం తెలుసుకుని ఎలా అయినా ఊరి ప్రజల ముందు తన అన్నను నిర్దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం ఆసక్తికరంగా సాగుతాయి. బ్రోకర్ మాటలు నమ్మి నక్సలైట్ల దుస్తులు ధరించి అభయారణ్యంలోకి వెళ్లిన ఊరి ప్రజలు చివరికి ఏమవుతారు? వారందరినీ రాజన్న కాపాడాడా?  అనే అంశాలు ఆసక్తికరంగా సాగుతాయి. సినిమా పరంగా అద్భుతం అని అనలేం గానీ ఆద్యంతం ఆకట్టుకునే సినిమా. ప్రతి ఒక్కరూ కొత్త వారే అయినా సినిమా చూస్తున్నంత సేపు ఎలాంటి బోర్ ఫీలింగ్ కలిగించకుండా తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
నటీనటులు

నటీనటులు:

నటీనటుల విషయానికి వస్తే సినిమాలో నటించిన వారందరూ కొత్తవారే. అయితే జయత్రి మాత్రం గతంలో యూట్యూబ్ వీడియోలు ద్వారా కాస్త ఫేమస్ అయ్యింది. ఈ సినిమా మొత్తానికి ఆమె కాస్త తెలిసిన ముఖం. అయితే క్రాంతి అనే పాత్రలో నటించిన సురంజిత్, రాజన్నగా నటించిన ప్రవీణ్, కుమార్ గా నటించిన శ్రీకాంత్ రాథోడ్, శివన్నగా నటించిన శివరాం, శరత్, వంశీ, వినీత్, విజయ్, కిషోర్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, మ్యాగీ వంటి వారందరూ కూడా కొత్తవారే అయినా సరే ఎక్కడా ఆ ఫీలింగ్ కలగకుండా చాలా సినిమాల అనుభవం ఉన్న వారిలా నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక దాదాపు సినిమాలో కనిపించిన వారందరూ కొత్త వారైనా ఎక్కడా ఆ ఫీలింగ్ అయితే కలగకుండా చూసుకోవడంలో సఫలమయ్యారు.

టెక్నీషియన్స్:
టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన అసెట్, సినిమా మొత్తం అడవుల నేపథ్యంలోనే సాగుతూ ఉండడంతో ప్రకృతిని రమణీయంగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ సఫలం అయ్యాడు.  అదేవిధంగా మణిశర్మ అందించిన సంగీతం సినిమాని మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. ఎడిటింగ్ విషయంలో కూడా అన్నీ తానై చూసుకున్నాడు డైరెక్టర్ జైదీప్ విష్ణు. ఆయనకు మొదటి సినిమానే అయినా ఎక్కడా తొట్రు పడకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పటంలో వంద మార్కులు సంపాదించారు. 

ఫైనల్ గా 
రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం  కామెడీ ఎంటర్టైనర్, కొత్త పాయింట్ కావడంతో అందరినీ మెప్పించ పోవచ్చు కానీ కామెడీ సస్పెన్స్ ఎలిమెంట్స్ కావాలనుకున్న వారికి మాత్రం నచ్చి తీరుతుంది. 

Rating: 2.75/5

 

 

Trending News