బాలీవుడ్‌లో సత్తా చాటిన "తెలుగు డైరెక్టర్లు"

తెలుగు సినిమా దర్శకులుగా పేరొందిన అనేక మంది మన డైరెక్టర్లు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటిన పలు సందర్భాలు ఉన్నాయి. ఎందరో తెలుగు దర్శకులు, హిందీలో కూడా పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారి గురించి మరి మనం కూడా తెలుసుకుందామా..!

Last Updated : Dec 14, 2017, 04:02 PM IST
బాలీవుడ్‌లో సత్తా చాటిన "తెలుగు డైరెక్టర్లు"

తెలుగు సినిమా దర్శకులుగా పేరొందిన అనేక మంది మన డైరెక్టర్లు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటిన పలు సందర్భాలు ఉన్నాయి. ఎందరో తెలుగు దర్శకులు, హిందీలో కూడా పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారి గురించి మరి మనం కూడా తెలుసుకుందామా..!

ఆదుర్తి సుబ్బారావు - మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి లాంటి ఆణిముత్యాల వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావు హిందీలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. డోలీ, దర్పన్, మన్ కా మీత్, మస్తానా, రఖ్ వాలా, జీత్ అందులో ప్రముఖమైనవి. అలాగే 1967లో మూగమనసులు చిత్రాన్ని హిందీలో 'మిలన్' పేరుతో సునిల్ దత్, నూతన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించారు. 

వి.మధుసూదనరావు - టాక్సీ రాముడు, అంతస్తులు, భక్త తుకారాం, మల్లెపువ్వు లాంటి మేటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన వి.మధుసూదనరావు హిందీలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో దేవి, సాస్ భీ కభీ బహూ థీ, సమాజ్ కో బదల్ డాలో, లవకుశ మొదలైన చిత్రాలు ప్రముఖమైనవి

కె.విశ్వనాథ్ - తెలుగులో స్వాతిముత్యం, సాగర సంగమం లాంటి ఆణిముత్యాల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విశ్వనాథ్ హిందీలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో సర్గమ్, కామ్ చోర్, సంజోగ్, ఈశ్వర్, ధన్వాన్, సంగీత్ చిత్రాలు ముఖ్యమైనవి

బాపు - తెలుగులో సాక్షి, మన ఊరి పాండవులు. పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు హిందీలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో పలు రీమేక్‌లు ఉన్నాయి. తెలుగులో వచ్చిన 'మన ఊరి పాండవులు' చిత్రాన్ని మిధున్ చక్రవర్తి హీరోగా హిందీలో 'హమ్ పాంచ్' పేరుతో రీమేక్ చేశారు. 

దాసరి నారాయణరావు - తెలుగులో తాను తీసిన అనేక సినిమాలను హిందీలో కూడా తానే స్వయంగా రీమేక్ చేశారు దిగ్దర్శకులు దాసరి నారాయణరావు. ఎక్కువగా తన చిత్రాలలో హీరోగా జితేంద్రను సెలెక్ట్ చేసేవారు దాసరి. హైసియత్, జ్యోతి బనే జ్వాలా, ప్రేమ్ తపస్య, మెహందీ రంగ్ లాయేగీ, సంతాన్, సర్ఫరోష్, వఫాదార్, యాద్గార్, జక్మీ షేర్ దాసరి దర్శకత్వం వహించిన పలు బాలీవుడ్ చిత్రాలు

కె.రాఘవేంద్రరావు - దర్శకేంద్రుడిగా తెలుగు సినీ అభిమానులు పిలుచుకొనే కె.రాఘవేంద్రరావు కూడా హిందీలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఫర్జ్ ఔర్ కానూన్, హిమ్మత్ వాలా, జానీ దోస్త్, జస్టిస్ చౌదరి, తోఫా, నయా కదమ్, మాస్టర్జీ, సుహాగన్, ధరమ్ అధికారి, మేరే సప్నోంకీ రాణీ,  ఆమ్దానీ అట్టానీ ఖర్చా రుప్పయా లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కె.రాఘవేంద్రరావు. రాజేష్ ఖన్నా, దిలీప్ కుమార్ లాంటి నటుల సినిమాలకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. 

కె.బాపయ్య - కె.రాఘవేంద్రరావు సోదరుడైన కె.బాపయ్య కూడా అనేక హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో దిల్ దార్, దిల్ ఔర్ దీవార్, బందీష్, టక్కర్, మావాలి, మక్సద్, వక్త్ కీ ఆవాజ్, ప్యార్ కా మందిర్, ప్యార్ కా కర్జ్ లాంటి చిత్రాలు ప్రముఖమైనవి. ఎక్కువగా మిధున్ చక్రవర్తి, జితేంద్ర, ధర్మేంద్ర ఈయన చిత్రాల్లో నటించారు. 

ఇవివి సత్యనారాయణ - తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన 'సూర్యవంశం' చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా రీమేక్ చేశారు ప్రముఖ తెలుగు దర్శకుడు ఇవివి సత్యనారాయణ. ఈ చిత్రాన్ని 1999లో పద్మాలయ స్టూడియోస్ నిర్మించడం విశేషం. 

కె.మురళీమోహనరావు - తెలుగులో బ్రహ్మరుద్రులు, కొదమ సింహం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.మురళీమోహనరావు హిందీలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బంధన్, విజేత, రఖ్ వాలా, దిల్ వాలా, ప్రేమ్ ఖైదీ, క్యా యహా ప్యార్ హై, డాడీ కూల్ చిత్రాలు అందులో ప్రముఖమైనవి.

రామ్ గోపాల్ వర్మ - 1989లో తాను తీసిన 'శివ' చిత్రంలో తెలుగు సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులను మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగులోనే కాక హిందీలో కూడా పలు హిట్ సినిమాలు తీశారు ఈయన. సత్య, కంపెనీ, సర్కార్, రంగీలా, రక్తచరిత్ర అందులో ప్రముఖమైనవి. రంగీలా, సత్య  చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ కూడా కైవసం చేసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం "న్యూక్లియర్" అనే ఓ ఇంగ్లీష్ సినిమా తీసే పనిలో ఉన్నారు. 

కె.విజయ్ భాస్కర్ - తెలుగులో నువ్వే కావాలి, స్వయంవరం, మల్లీశ్వరి, ప్రేమ కావాలి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ హిందీలో కూడా ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే 'నువ్వే కావాలి' చిత్రానికి హిందీ రీమేకైన 'తుజే మేరీ కసమ్'. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు. 

తేజ - ఒకప్పుడు పలు బాలీవుడ్ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన తేజ తాను తెలుగులో తీసిన 'నువ్వు నేను' చిత్రాన్ని హిందీలో 'యే దిల్' పేరుతో రీమేక్ చేశారు. తుషార్ కపూర్, అనిత ఈ చిత్రంలో జంటగా నటించారు

కృష్ణవంశీ - సిందూరం, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం, మహాత్మ, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించిన డైరెక్టర్ కృష్ణవంశీ హిందీలో కేవలం ఒక చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించారు. అదే అంతఃపురం చిత్రానికి రీమేక్ చిత్రం 'శక్తి'. కరిష్మా కపూర్, షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

పూరీ జగన్నాథ్ - 2004లో 'బద్రి' చిత్రాన్ని హిందీలో 'షరత్' పేరుతో రీమేక్ చేసిన పూరీ జగన్నాథ్, 2011లో మళ్ళీ అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 

క్రిష్ - గమ్యం, వేదం, కంచె, గౌతమపుత్ర శాతకర్ణి లాంటి తెలుగు చిత్రాలతో తన సత్తా ఏమిటో చూపించిన దర్శకుడు క్రిష్, బాలీవుడ్‌లో కూడా తానేమిటో నిరూపించుకున్నారు.  2015లో 'ఠాగూర్' చిత్రం ఆధారంగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' చిత్రానికి దర్శకత్వం వహించారు క్రిష్. ప్రస్తుతం కంగనా రనౌత్ హీరోయిన్‌గా ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా 'మణికర్ణిక' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Trending News