Tollywood Senior Actor Vallabhaneni Janardhan Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా ఇప్పుడు మరో సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ లో చేరారు. ఇక చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు.
ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. పెద్దల సమక్షంలో జరిగిన ఈ వివాహ బంధంతో వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. అయితే మొదటి కుమార్తె శ్వేత చిన్నతనంలోనే చనిపోగా రెండవ కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్నారు, వీరి కుమారుడు అవినాష్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గరలోని పోతనూరు అనే గ్రామంలో జన్మించిన వల్లభనేని జనార్ధన్ ముందు నుంచి సినిమాల మీద చాలా ఆసక్తి పెంచుకున్నారు.
విజయవాడ లయోలా కాలేజీలో చదివి డిగ్రీ పట్టా పుచ్చుకునే లోగానే ప్రపంచ సినిమా మీద అవగాహన పెంచుకొని పలువురు దర్శకుల బాణీని సైతం ఆయన వంటబట్టించుకున్నారని చెబుతూ ఉంటారు. సినిమా నటుడిగా మారకముందే సొంత నిర్మాణ సంస్థ స్థాపించి ‘మామ్మ గారి మనవలు’ అనే పేరుతో ఒక సినిమా మొదలుపెట్టారు. అయితే అనుభవరాహిత్యంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 21 ఏళ్ల వయసులోనే కన్నడ హిట్ సినిమా మానససరోవరం ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి అనే సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.
ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా హిందీలో తెరకెక్కిన బసేరాను తెలుగులో తోడునీడగా రూపొందించారు. తర్వాత నటుడిగా మారిన ఆయన విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన అనేక సినిమాల్లో నటించారు. చిరంజీవి విజయబాపినీడు కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ లో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాల్లో చిన్నాచితక పాత్రలు పోషిస్తూ వచ్చారు. జనార్ధన్ కు సినిమాల మీద ఉన్న పిచ్చితో ఎలాంటి సినిమాలు అయినా ఎలాంటి పాత్ర ఇచ్చినా కాదనకుండా చేసేవారు.
చిరంజీవితో అనేక సినిమాల్లో నటించిన జనార్దన్ బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, నాగార్జునతో వారసుడు, వెంకటేష్ తో సూర్య ఐపిఎస్ వంటి సినిమాల్లో నటించారు. తరువాత ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత లాంటి సీరియల్స్ లో కూడా ఆయన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తన కుమార్తె శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషనల్ అనే సంస్థను ప్రారంభించి శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు లాంటి సినిమాలను ఆయన నిర్మించారు. శ్రీమతి కావాలి అనే సినిమా షూటింగ్ సమయంలో అనుకున్న సమయానికి ఒక ఆర్టిస్ట్ రాకపోవడంతో అప్పటికప్పుడు దర్శకుడిగా ఉన్న తానే నటుడిగా మారారు జనార్ధన్.
ఇక తర్వాతి కాలంలో తన మామ విజయబాపినీడుతో కలిసి మహా జనానికి మరదలు పిల్ల అనే సినిమాని తెరకెక్కించారు. అంతేకాక డైరెక్టర్ శ్రీను వైట్ల మొదటి సినిమా నీకోసం అనే సినిమాకి కూడా జనార్ధన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక జనార్ధన్ మరణ వార్త విని తెలుగు సినీ ప్రముఖులందరూ షాక్ అవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడవ మరణం అని సీనియర్ నటులందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు లోకాన్ని వీడి వెళ్లిపోవడం బాధాకరమని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన కుమారుడు అమెరికాలో నివాసం ఉంటూ ఉండడంతో ఆయన వచ్చిన తర్వాతే అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: TSSPDCL JLM Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు!
Also Read: చొక్కా బొత్తాలు విప్పేసి రెచ్చిపోయిన నేహా శెట్టి..ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ ట్రీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook