విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాలో అతడే స్వయంగా పాడిన వాట్ ది ఎఫ్ పాటలో శ్రీరాముడి గురించి పలు అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీనిపై సదరు సంఘాలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాయి. దీనికితోడు ఈ పాట పాడిన విజయ్ దేవరకొండ గొంతు సైతం బాగోలేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో మరింత డ్యామేజీ జరగకముందే మేల్కోవడం ఉత్తమం అని భావించిన ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రస్తుతానికి య్యూట్యూబ్ నుంచి ఆ పాటను తొలగించింది. పాటలోని లిరిక్స్‌ని మార్చి, మళ్లీ కొత్తగా పాడిన పాటను అప్‌లోడ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టంచేసింది.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేయగా విజయ్ దేవరకొండ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించింది. జూలై 29న గీత గోవిందం సినిమా ఆడియో లాంచ్ కానున్న నేపథ్యంలో ఇంత తక్కువ వ్యవధిలో ఈ పాటను మళ్లీ ఎలా రూపొందించి విడుదల చేస్తారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 29న ఆడియో లాంచ్ అయితే కానీ సినిమాలో ఇక ఈ పాట ఉంటుందా లేదా అనే విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.