నటి శ్రీదేవి చనిపోయి వారం రోజులయ్యింది. మేనల్లుడు మోహిత్ మార్వా వివాహంలో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి అక్కడ ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు. ఈ మృతిపై మీడియా, వార్తాపత్రికల్లో అనేక అనుమానాలు, కథనాలు వెలువడ్డాయి. తొలుత గుండెపోటుతో చనిపోయారన్నారు. ఆ తర్వాత హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో పడి మృతిచెందారని అన్నారు.
అయితే, శ్రీదేవి చనిపోయిన రోజు రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది? తదితర విషయాలను ఆమె భర్త బోనీకపూర్ తన స్నేహితుడు, సినీ విశ్లేషకుడు కోమల్ నహతాకు చెప్పాడట. ఈ విషయాలన్నీ కోమల్ తన బ్లాగ్‌లో రాశారు.
'దుబాయ్‌కి ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకోలేదు. మోహిత్ పెళ్లయ్యాక జాన్వికి బట్టలు కొనడానికి శ్రీదేవి కొన్నిరోజులు దుబాయ్‌లోనే ఉంటాను అంది. దాంతో నాకు లక్నోలో పనుండి ఇండియా వచ్చేశాను. ఫిబ్రవరి 24న ఉదయం శ్రీదేవి నాకు ఫోన్ చేసి, నన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పింది. అదే రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్లు శ్రీదేవికి చెప్పలేదు. అయితే శ్రీదేవికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు. అందుకే జాన్వీ నాకు ఫోన్ చేసి 'తొందరగా దుబాయ్‌కి బయలుదేరు డాడీ' అని చెప్పింది.'
'ఫిబ్రవరి 24 తేదిన సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లాను. అయితే శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని నా లగేజీని కాస్త లేటుగా గదిలో పెట్టమని బెల్‌బాయ్‌కి చెప్పాను. నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో గది తలుపు తీశాను. శ్రీదేవి నన్ను చూసిన సంతోషంతో హత్తుకుంది. నేను దుబాయ్‌కి వచ్చి తనను సర్‌ప్రైజ్ చేస్తానని ముందే ఊహించానని శ్రీదేవి చెప్పింది. అరగంట పాటు శ్రీదేవి, నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాం.'
'ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్‌కి వెళ్లాలనుకున్నాం. శ్రీదేవి స్నానం చేసి వస్తానంది. నేను హోటల్‌లోని లివింగ్ రూంలో ఉంటానని చెప్పాను. తను వచ్చేవరకు టీవీ చూస్తూ అక్కడే కూర్చున్నాను. కానీ ఎంతసేపటికీ గది నుంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో చూద్దామని గదిలోకి వెళ్లాను. తను ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు. చాలాసార్లు తలుపు కొట్టి చూశాను. స్పందన లేదు. బాత్రూమ్ తలుపు గడియ పెట్టలేదు. దాంతో లోపలికి వెళ్లాను. తీరా చూస్తే నీరు నిండా ఉన్న బాత్‌టబ్‌లో మునిగిపోయి ఉంది. అది చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది.' అని బోనీకపూర్ నహతాకు చెప్పాడట.