శంకర్ దాదాకు 'జాదూ కీ ఝప్పీ' ఇచ్చిన మున్నాభాయ్‌ !

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ ఇవాళే విడుదలైంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ జంటగా నటించగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated: Jan 11, 2019, 03:59 PM IST
శంకర్ దాదాకు 'జాదూ కీ ఝప్పీ' ఇచ్చిన మున్నాభాయ్‌ !
ఇన్‌సెట్‌లో చిరంజీవిని ఆప్యాయంగా హత్తుకున్న సంజయ్ దత్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ నటించిన బ్లాక్ బస్టర్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ వంటి చిత్రాలను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరిట చిరు రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టడం, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తొలిసారిగా బాలీవుడ్ తెరకి పరిచయం చేస్తూ తెరకెక్కించిన తుఫాన్ సినిమాలోనూ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషించి చెర్రీకి మంచి సపోర్ట్ అందించడం వంటివి వారి మధ్య అనుబంధాన్ని మరింత ధృడమయ్యేలా చేశాయి. 

వీళ్ల మధ్య ఉన్న అనుబంధం సంగతి గురించి కాసేపు పక్కకుపెడితే, తాజాగా చెర్రీ, ఉపాసన కలిసి నిర్వహించిన ఓ ఈవెంట్‌కి సంజయ్ దత్ అతిథిగా విచ్చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సంజయ్ దత్.. అక్కడ చిరు, చరణ్‌లతో కాసేపు సరదాగా సంభాషించినట్టు ది ఫ్రీ ప్రెస్ జర్నల్ వెల్లడించింది. ఇదేకాకుండా ఈ ఈవెంట్ గురించి ట్వీట్ చేసిన ఉపాసన సైతం.. ఆ ఫోటోలను నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు. 

ఇదిలావుంటే, రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ ఇవాళే విడుదలైంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ జంటగా నటించగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందనే లభించగా తాజాగా విడుదలైన సినిమాకు సైతం అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.