ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబరులో ప్రారంభమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అనేక వార్తలు టాలీవుడ్ పరిశ్రమలో కోడై కూస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు పలువురు అంటున్నారు.
అయితే ఎట్టకేలకు ఈ విషయంపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కడంలో లేదని తెలిపారు. రాజమౌళి ఈ కథకు సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ మాత్రమే పంచుకున్నారని.. కథా చర్చలకు సంబంధించి మరింత సమయం పడుతుందని తెలిపారు
రంగస్థలం చిత్ర విజయంతో రామ్ చరణ్ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో హీరోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారన్న వార్త వారి అభిమానుల్లో ఆసక్తిని పెంచుకోంది. పైగా ఈ మెగా ప్రాజెక్టుని రాజమౌళి తెరకెక్కించడంతో అంచనాలు కూడా చాలా భారీగా ఉన్నాయి.