ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ అధినేత సాయి ప్రసాద్‌పై విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ప్రసాద్ స్టూడియోస్‌లో ఓ రికార్డింగ్ స్టూడియోను ఎల్.వి. ప్రసాద్ తనకు బహుమతిగా ఇచ్చారని.. అప్పటి నుంచి తాను అక్కడే తన పాటలను కంపోజ్ చేసుకుంటున్నానని చెప్పిన ఇళయరాజా.. తాజాగా ఎల్.వి.ప్రసాద్ మనవడు సాయిప్రసాద్ ఆ స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. స్టూడియోలోని సంగీత పరికరాలను కూడా సాయిప్రసాద్ డ్యామేజ్ చేశారని ఇళయరాజా పోలీసుల ఎదుట వాపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుపై విరుగంబాక్కం పోలీసులు దర్యాప్తు చేపట్టారనేది సదరు వార్తల సారాంశం.
ఇళయరాజా పోలీసు స్టేషన్, కోర్టు మెట్లెక్కడం ఇదేం తొలిసారి కాదు. పలువురు ఆర్టిస్టులు, ప్రొడక్షన్ కంపెనీలు తన అనుమతి లేకుండానే తన బాణీలను వాడుకుంటున్నారని గతంలో కాపీ రైట్స్ చట్టం కింద ఇళయరాజా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.