'ఇస్మార్ట్ శంకర్' గా తెరపైకి వచ్చిన రామ్..బొమ్మ హిట్టా ఫట్టా ?

ధియోటర్లలో దుమ్మరేపేందుకు ''ఇస్మార్ట్ శంకర్'' మాస్ గెటప్ తో తెరపైకి వచ్చేశాడు

Last Updated : Jul 18, 2019, 03:56 PM IST
'ఇస్మార్ట్ శంకర్' గా తెరపైకి వచ్చిన రామ్..బొమ్మ హిట్టా ఫట్టా ?

పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించాలనేది రామ్ కోరిక. ఎలాగైనా హిట్ కొట్టాలనేది పూరి జగన్నాధ్ ఆశ. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? వీళ్ల కలలు నెరవేరాయా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి 

కథ :
ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది.

తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్).

ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు:
హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో ఇస్మార్ట్ శంకర్ కు హైలైట్ గా నిలిచాడు రామ్. కొన్ని సందర్భాల్లో తెలంగాణ యాసతో కూడిన డైలాగ్స్ , ఎనర్జీతో కూడిన నటన, డాన్సులు  బాగా అలరిస్తాయి.  నిధి అగర్వాల్, నభా నటేష్ గ్లామర్ క్యారెక్టర్స్ తో సినిమాకు ప్లస్ అయ్యారు. సత్యదేవ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. గెట‌ప్ శ్రీను తన మార్క్ కామెడీతో నవ్వించాడు. పునీత్ ఇస్సార్‌, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే తదితరులు క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు:
ముందుగా పూరి జగన్నాధ్ గురించే చెప్పుకోవాలి. ఈ సినిమాకు మంచి లైన్ ఎంచుకోవడంతో పాటు మరోసారి పదునైన డైలాగ్స్ రాశాడు పూరి. దీనికితోడు తెలంగాణ యాసను యాడ్ చేయడం సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది. పూరి తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి మణిశర్మ. ఈ సినిమాతో మణి ఈజ్ బ్యాక్ అనిపించకమానదు. పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే దుమ్ముదులిపాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఔట్ స్టాండింగ్.
పూరి విజన్ ను పెర్ ఫెక్ట్ గా స్క్రీన్ పై చూపించాడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. మరీ ముఖ్యంగా పాటలన్నీ కలర్ ఫుల్ గా ఉన్నాయి. పాటల్లో భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. జానీ షేక్ ఆర్ట్ వర్క్, జునైద్ ఎడిటింగ్ సినిమాకు మరింత లుక్ తీసుకొచ్చాయి.

 రివ్యూ:
మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ. అదే ఓ సీనియర్ డైరక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తే మిస్ అవ్వదు. ఇస్మార్ట్ శంకర్ విషయంలో ఇదే జరిగింది. ఎట్టకేలకు రామ్ కోరిక నెరవేరింది. పూరి కల తీరింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది.

పూరి-రామ్ కలిసి ఫస్ట్ టైమ్ సినిమా చేశారు. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఫస్ట్ టైమ్ కలిశారు కాబట్టి రామ్ ను మాస్ గా, తనదైన స్టయిల్ లో చూపిస్తే సరిపోతుందని అనుకోలేదు పూరి. ఈసారి అతడితో పాటు కూర్చొని మంచి కథ రాసుకున్నాడు. డైలాగ్స్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఆ వర్క్ ఇస్మార్ట్ శంకర్ లో కనిపించింది.

పూరి జగన్నాధ్ హీరోలది ఓ సెపరేట్ బ్రాండ్. అప్పటివరకూ ఎన్ని సినిమాలు చేసినా పూరి డైరక్షన్ లో చేస్తే ఓ కొత్త రకం ఇమేజ్, మేనరిజమ్ వచ్చి చేరతాయి. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు కూడా అదే జరిగింది. ఇన్నాళ్లూ రామ్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. పూరి డైరక్షన్ లో ఫస్ట్ టైమ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మరో ఎత్తు. ఈ హీరో కెరీర్ లో ఇది బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుంది. అంతేకాదు.. పూరి క్రియేట్ చేసిన బెస్ట్ క్యారెక్టరైజేషన్లలో కూడా ఒకటిగా నిలిచిపోతుంది.

సినిమా మాస్ ఎలిమెంట్స్ తోనే మొదలవుతుంది. మాస్ ఎలిమెంట్స్ తోనే క్లోజ్ అవుతుంది. మధ్యలో ఎక్కడా గ్రాఫ్ తగ్గదు. రామ్ తన మాస్ విశ్వరూపం చూపించాడు. పూరి రాసిన డైలాగ్స్ ను రామ్ చెబుతుంటే థియేటర్లలో ఈలలు, చప్పట్లు పడుతున్నాయి. ఇలా పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

ఇస్మార్ట్ శంకర్ లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ ను గ్రిప్పింగ్ గా రాసిన పూరి, సెకెండాఫ్ కు వచ్చేసరికి ఆ మేజిక్ చూపించలేకపోయాడు. సెకెండాఫ్ నుంచి సినిమా క్లయిమాక్స్ కు వచ్చేవరకు ఊహించే విధంగానే సాగుతుంది. 2-3 చోట్ల స్క్రీన్ ప్లేలో జర్క్ లు కూడా ఉన్నాయి. ఇలాంటి చిన్నచిన్న మైనస్ పాయింట్స్ ను తన పెర్ఫార్మెన్స్ తో మరిచిపోయేలా చేశాడు రామ్. దీనికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా యాడ్ అవ్వడంతో ఇస్మార్ట్ శంకర్ కిర్రాక్ అనిపించుకున్నాడు. ఓవరాల్ గా ‘ఇస్మార్ట్’ శంకర్ థియేటర్లలో మెరుపులు మెరిపిస్తాడు. ఈ వీకెండ్ ఫుల్ జోష్ ఇస్తాడు.

నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి
సమర్పణ: లావణ్య
బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిడివి : 140 నిమిషాలు
సెన్సార్ : A
రిలీజ్ డేట్ : జులై 18, 2019

రేటింగ్ 3.25/5

Trending News