శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఇటీవలే "దడక్" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి సమీక్షలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జాన్వి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "తాను తన తల్లి మాదిరిగా గొప్ప స్టార్‌ని కావాలని కోరుకోవడం లేదని.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన ఆకాంక్ష" అని ఆమె తెలిపారు. ముంబయిలో "దడక్" సినిమా ప్రదర్శిస్తున్న గైతీ గ్యాలక్సీ థియేటర్ వద్ద నటుడు ఇషాన్, దర్శకుడు శశాంక్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జాన్వి జవాబిచ్చారు.
"ఈ చిత్రంలో నా నటనను చూసి గర్వపడుతున్నానని స్వయానా దర్శకుడే చెప్పినప్పుడు ఎంతగానో ఆనందించాను. అంతకంటే ముందు ఆడియన్స్ ఈ సినిమా ద్వారా నన్ను స్వీకరించినందుకు మరింత సంతోషంగా ఉంది" అని జాన్వి అభిప్రాయపడ్డారు. మరాఠీ చిత్రం "సైరత్"కు రీమేక్ అయిన "దడక్" చిత్రం తొలిరోజే రూ.8.71 కోట్లు వసూలు చేసి బయ్యర్లకు లాభాలను ఆర్జించి పెట్టింది. ఈ ప్రేమకథను యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అనేది తమకు మరింత స్ఫూర్తినిచ్చిందని ఈ సందర్భంగా "దడక్" చిత్ర దర్శకుడు శశాంక్ కైతాన్ తెలిపారు.
శ్రీదేవి కుమార్తె జాన్వి తన తొలి చిత్రానికి సైన్ చేయకముందే.. లాస్ ఏంజెలీస్‌లో స్ట్రాట్స్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. చిన్నప్పుడు తన సోదరి ఖుషీతో కలిసి ఆమె ముంబయిలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకున్నారు. 2016లో ఆమె వరుణ్ ధావన్ సరసన కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో "సిద్దాత్" అనే చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కాకపోతే.. అనివార్య కారణాల వల్ల ఆమె ఆ చిత్రంలో నటించలేదు. శ్రీదేవి మరణించక ముందే.. జాన్వి "దడక్" చిత్రానికి సైన్ చేశారు.