ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతకు కొద్ది ముందు రోజుల సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించిన బాలయ్య బాబు ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికల బిజీ పూర్తవడంతో ఇక మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసిన ఆయన.. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి చర్చల్లో ఉన్న ఈ సినిమాను బాలయ్య బాబు అనేక తర్జన భర్జనల తర్వాత ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ టాక్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15వ తేదీ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం.
బీహార్‌లో ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్‌లోనే కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం బాలయ్య బాబు బీహార్ వెళ్లనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం బాలయ్య బాబు అభిమానులను ఆనందానికి గురిచేసే అంశం కానుంది.