సినీనటుడు డా రాజశేఖర్ తన అప్‌కమింగ్ సినిమా 'కల్కి' షూటింగ్లో పాల్గొంటుండగా ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని ఇటీవల మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను ప్రచురించే క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు ఏకంగా పలు ఫోటోలను ఆయా కథనాలతో జతపరిచిన తీరు ఈ వార్తకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చింది. దీంతో రాజశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం అతడు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడని ఏవేవో కథనాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ప్రమాదం జరిగిందని, తీవ్రంగా గాయపడ్డానని ఫోటోలతో యుక్తంగా వస్తున్న కథనాలపై తాజాగా స్పందించిన రాజశేఖర్.. ''తాను కల్కి సినిమా షూటింగ్లో స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం జరిగి గాయపడిన మాట వాస్తవమే కానీ.. ఆ ఫోటోలు మాత్రం ఫేక్'' అని స్పష్టంచేశారు.
ప్రస్తుతం తాను తన కుటుంబం, కల్కి యూనిట్‌తో కలిసి కులు మనాలిలో షూటింగ్ కోసం వెళ్తున్నామని, విశ్రాంతి లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నానని తెలిపారు. చాలామంది పెద్ద పెద్ద నటీనటులు నటిస్తున్న సినిమా కావడంతో సినిమా షూటింగ్ ఆపితే, మళ్లీ డేట్స్ విషయంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున తాము రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నట్టు రాజశేఖర్ తెలిపారు. మనాలికి వెళ్లేదారిలో ఓచోట కొండ చరియలు విరిగిపడి ఆటంకం ఎదురైనప్పటికీ.. అందరం సురక్షితంగానే ఉన్నామని రాజశేఖర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా మళ్లీ ఆ పాత ఫోటోలతో కలిసి ప్రచురించొద్దు సుమీ అని మీడియా వైఖరిపై ఓ జోక్ కూడా పేల్చారు రాజశేఖర్.