వివాదాస్పదమైన అంశాలు, ప్రజా జీవితంలో పేరొందిన ప్రముఖుల జీవితాల యదార్థగాథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకునే రాంగోపాల్ వర్మ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. ఎప్పటినుంచో ఏవేవో కారణాలతో పెండింగ్ పడుతూ వస్తోన్న ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ అనే చిత్రాన్ని వర్మ మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు. భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఇదేనని క్లెయిమ్ చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ.. తన కెరీర్‌లోనూ ఇదే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని ప్రకటించాడు. మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ బ్రూస్‌లీ అంటే తనకు ఎంతో అభిమానం పలు సందర్భాల్లో చెప్పిన రాంగోపాల్ వర్మ.. నేడు బుధవారం బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3.12 గంటలకు ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు వర్మ ట్విటర్ ద్వారా తెలిపాడు. బ్రూస్ లీ జన్మించిన సమయాన్నే ఈ సినిమా టీజర్ విడుదలకు సరైన సమయంగా వర్మ ఎంచుకున్నాడు.
ENTER THE GIRL DRAGON teaser release today at 3.12 pm the universal birth time of BRUCE LEE ..The film is a triangular love conflict between a girl, her loved one and Bruce Lee #EnterTheGirlDragon #BruceLeeGirl pic.twitter.com/p4p7XYuo09
— Ram Gopal Varma (@RGVzoomin) November 27, 2019
చైనీస్ నిర్మాతతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించిన వర్మ.. సదరు నిర్మాతతో కలిసి ఒప్పంద పత్రంపై సంతకం చేస్తున్న ఫొటోను కూడా ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ మూవీ అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ వెల్లడించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తన ట్వీట్‌లో స్పష్టంచేశాడు.