అతిలోక సుందరికి స్విజర్లాండ్‌లో దక్కిన అరుదైన గౌరవం

దివికెగసిన అతిలోక సుందరి శ్రీదేవిని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం గౌరవించుకోనుంది.

Last Updated : Sep 9, 2018, 11:47 PM IST
అతిలోక సుందరికి స్విజర్లాండ్‌లో దక్కిన అరుదైన గౌరవం

బెర్న్: దివికెగసిన అతిలోక సుందరి శ్రీదేవిని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం గౌరవించుకోనుంది. శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్విట్జర్లాండ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రం 'చాందిని' చిత్రాన్ని దేశంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రమే కాదు..  'చాందిని' సహా ఇతర చిత్రాలనూ స్విస్‌లోని లొకేషన్‌లలో చిత్రికరించారు. ఆల్పైన్ పర్వత దేశ అందాలను తన చిత్రాల్లో అందంగా చూపించి ఆ దేశానికి వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్యను పెరిగేలా చేసిన ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర నిర్మాత యశ్ చోప్రా విగ్రహాన్ని 2016లో ఇంటర్లాకెన్‌లో ఆవిష్కరించారు. ఈ కోవలోనే అతిలోక సుందరి అద్భుత శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు.  

1989లో బ్లాక్ బాస్టర్ చిత్రం 'చాందిని'లోని సగానికి పైగా పాటలు, డ్యాన్సులు స్విస్‌లోనే చిత్రీకరించారు. 1964లో రాజ్ కపూర్ నటించిన 'సంగం' అనే చిత్రం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అప్పటి నుండి బాలీవుడ్ సినిమా షూటింగ్లు స్విస్‌లో జరుపుకోవడం మొదలుపెట్టాయి. ఆల్పైన్ పర్వతాల్లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించేవారు.

అయితే, 1995 నుండి స్విస్‌కు భారతీయ పర్యాటకుల తాకిడి పెరగడానికి ప్రధాన కారణం మాత్రం.. యశ్ చోప్రా ప్రొడక్షన్‌లో వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రం. అందులో స్విస్ అందాలను, రొమాంటిక్ సన్నివేశాలను ఎంతో అందంగా చూపించి.. పర్యాటకుల తాకిడికి యశ్ చోప్రా కారకులయ్యారు.

ఇంటర్లాకెన్ ప్రభుత్వం 2011లో యశ్ చోప్రాకు ఇంటర్లాకెన్ రాయబారి గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఓ రైలుకి ఆయన పేరు పెట్టి  ఆయన్ను సత్కరించింది.

దర్శకుడిగా చోప్రా చివరి చిత్రం 'జబ్ తక్ హై జాన్' కూడా స్విట్జర్లాండ్‌లోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయన ఆకస్మిక మరణం కారణంగా ఆ ఆలోచనను రద్దుచేసుకున్నారు. Lauenenseeలో యశ్ చోప్రా పేరుమీద ఓ సరస్సు కూడా ఉంది. ఇక్కడ కూడా సినిమా షూటింగ్లు జరుగుతుంటాయని అక్కడి అధికారి తెలిపారు.

శ్రీదేవి నాలుగు దశాబ్దాలకు పైగా భారతీయ చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషల్లో నటించారు. కానీ 2018 సంవత్సరంలో దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి..  55 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు.

Trending News