బైకర్లకు షాక్.. ఐఎస్‌ఐ మార్కు లేని హెల్మెట్ ధరిస్తే.. 2 లక్షల జరిమానా..!

రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

Last Updated : Aug 12, 2018, 05:14 PM IST
బైకర్లకు షాక్.. ఐఎస్‌ఐ మార్కు లేని హెల్మెట్ ధరిస్తే.. 2 లక్షల జరిమానా..!

రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ హెల్మెట్ కూడా ఎలాంటిది ధరించాలనే నిబంధన కూడా అమలులోకి రానుంది. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసుల బాధ పడలేక.. ఏదో ఒక హెల్మెట్ కొనేస్తే చాలని తక్కువ ధరకు వచ్చే చీప్ క్వాలిటీ హెల్మెట్లు కొంటున్నారు జనాలు. వారు అలా కొనడం వల్ల పేరు, ఊరూ లేని బ్రాండ్లన్నీ ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చి క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి అడ్డగోలు వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం కోసం కొత్త నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నారు.

కొత్త నిబంధన ప్రకారం.. వాహనదారులు ధరించే హెల్మెట్‌కు ఐఎస్‌ఐ(ఇండియన్‌ స్టాండర్డ్‌ ఇనిస్టిట్యూట్‌) గుర్తింపు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి గుర్తింపు లేని హెల్మెట్లు ధరిస్తే మాత్రం తప్పకుండా చిక్కుల్లో పడతారు. ఎందుకంటే.. ఐఎస్‌ఐ మార్కు లేని హెల్మెట్ ధరించేవారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం చాలా ఎక్కువ రుసుము జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.2 లక్షల రూపాయల వరకు ఆ జరిమానా ఉంటుందని సమాచారం. ఆ జరిమానా కట్టలేని పక్షంలో రెండు సంవత్సరాల కారాగార శిక్షనైనా అనుభవించాల్సి ఉంటుంది. 

ఈ మధ్యకాలంలో ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ నోటీసుల్లో తెలిపింది. అలాగే ఐఎస్ఐ మార్కుతో హెల్మెట్లు తయారీ చేసే కంపెనీలకు కూడా రవాణా శాఖ కొన్ని సూచనలు చేసింది. హెల్మెట్ల బరువు 1.2 కిలోలకు తక్కువ లేదా సమానంగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ మధ్యకాలంలో ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్లు విరివిగా తయారవుతున్నాయి. రోడ్డుల మీదా, ఫుట్‌పాత్‌ల చాలా తక్కువ ధరకు ఈ హెల్మెట్లను అమ్ముతున్నారు.

కొత్త నిబంధన వచ్చాక.. ఈ అడ్డగోలు వ్యాపారం మీద భారీ ప్రభావం పడనుంది. బైకర్లు కూడా షోరూమ్‌కి వెళ్లి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్లు కొనాలని.. లేకపోతే చిక్కుల్లో పడతారని ట్రాఫిక్ పోలీసులు కూడా చెబుతున్నారు. జనవరి 15, 2019 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. సాధారణంగా ఐఎస్‌ఐ మార్కు గల హెల్మెట్ల ధర రూ.800 నుండి రూ.3000 రూపాయల వరకూ ఉంటుంది. కానీ హెల్మెట్లను రూ.250 నుండి రూ.400 వరకు కూడా ఫుట్‌పాత్‌ల మీద చాలామంది అమ్ముతున్నారు. ఇప్పుడు అలాంటి వ్యాపారాలకు కాలం చెల్లనుంది. 

Trending News