చక్రధర్‌పూర్/బహరగొడ: దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని(Infiltrators) గుర్తించి 2024 సాధారణ ఎన్నికలకు ముందే వారిని దేశం నుంచి పంపించేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర పట్టిక(NRC)ను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. అక్రమ చొరబాటుదారులపై రాహుల్ గాంధీ ఎందుకు ప్రేమ చూపుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులను పంపించేస్తే.. వాళ్లు ఎక్కడుంటారు ? ఏం తింటారు అంటూ రాహుల్ బాబా వారిపై ప్రేమను కనబరుస్తున్నారు అంటూ రాహుల్ గాంధీకి చురకలంటించారు.
అదే విధంగా జార్ఖండ్‌లో కాంగ్రెస్ - ఆర్‌జెడి - జెఎంఎం పార్టీల కూటమిపై సైతం అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 55 సంవత్సరాల కాలంలో చేసిందేమి లేదని అన్నారు. గత మీ పరిపాలనలో ధర్నాలు, రాస్తారోకోలు, భయంకరమైన పరిస్థితులు ఉండేవనీ.. కానీ రఘుబర్ దాస్ నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్‌లో అవినీతిరహిత పాలన అందిస్తోందని అన్నారు. జార్ఖండ్‌లో ఏ ఆటంకాలు లేకుండా మొదటిసారిగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీనేని అమిత్ షా పేర్కొన్నారు.