Vikarabad Collector: రైతుల ఆగ్రహానికి ప్రధాన కారణం తమ ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడమే. ఫార్మా కంపెనీలను పచ్చటి పొలాల మధ్య ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడమే కలెక్టర్‌పై దాడికి కారణంగా నిలిచింది. స్థానికంగా ఫార్మా కంపెనీల ఏర్పాటును రైతులతోపాటు అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆయా గ్రామాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కానీ ప్రధాన మీడియా రైతుల ఉద్యమాన్ని బహిర్గతం చేయలేదు. కానీ స్థానికంగా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. తమ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం రైతుల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఫలితంగా అధికారులపై దాడి.
Also Read: Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం
వివాదం ఎక్కడ?
నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల్లో క్లస్టర్లుగా ఫార్మా హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో వివాదం రాజుకుంది. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు నిర్ణయించి మొత్తం 1,314.21 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయించారు. మూడు గ్రామాల్లో పట్టా భూములు సేకరిస్తుండడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూములు కోల్పోతున్న రైతులతోపాటు ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితమవుతుందనే ఆందోళనతో మిగతా రైతులు కూడా ఆందోళనలో భాగమయ్యారు. అక్టోబర్ 25వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్‌పై రోటిబండతండావాసులు దాడి చేసినా అధికారుల్లో మార్పు లేకపోవడంతో రైతుల్లో ఆగ్రహం తీవ్రమై లగచర్లలో దాడికి దారి తీసింది.
Also Read: KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇది
గ్రామాల వారీగా భూ సేకరణ ఇలా..
- హకీంపేట గ్రామంలో పట్టా భూములు 366.34 ఎకరాలు
- పోలెపల్లిలో 130.21 ఎకరాలు
- లగచర్లలో 156.05 ఎకరాలు
- మిగతా 637.36 ఎకరాలు అసైన్డ్ భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం
పరిహారం ఇలా
- భూములు ఇచ్చే రైతులకు ఎకరా భూమికి రూ.10 లక్షల నగదు పరిహారం
- 120 గజాల ఇంటి స్థలం
- ఇందిరమ్మ ఇల్లు
- రైతు కుటుంబంలో అర్హతను బట్టి ఫార్మా కంపెనీల్లో ఇంటికో ఉద్యోగం
గతంలోనే దాడి
మొదటి నుంచి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్‌పై రోటిబండతండావాసులు దాడి చేశారు. లగచర్లలో భూములు కోల్పోతున్న కుటుంబాలు దాదాపు 200 పైన ఉన్నాయి. తమకు జీవనాధారమైన భూములు కోల్పోతే బతుకు భారమవుతుందని ఆందోళన చెందుతున్నారు. భూములు ఇచ్చినా కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిహారం దక్కుతుందో లేదోననే అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ గ్రామాల్లో కాలుష్యం వెదజల్లుతుందని.. అనారోగ్యం పాలవుతామనే ఆందోళన ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది. చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మా కంపెనీలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత
స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేస్తుండడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడంతో కొడంగల్ నియోజకవర్గానికి మేలు జరుగుతుందని భావిస్తే శాపంగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై తన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేస్తున్నా రేవంత్ రెడ్డిలో చలనం లేకపోవడంతో సొంత ప్రజలే తిరుగుబాటు పట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుగుబాటు జరగడంతో రేవంత్ రెడ్డి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి