అమితాబ్ సిన్మా నన్ను రౌడీగా మార్చింది

   

Last Updated : Nov 12, 2017, 04:01 PM IST
అమితాబ్ సిన్మా నన్ను రౌడీగా మార్చింది
బెల్ బాటమ్ ఫ్యాంటు వేసుకొని.. చేతిలో కత్తితో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని పొడుస్తాడు హీరో.. ఓ అమితాబ్ సినిమాలో చూసిన ఆ సీన్ అతనిపై బాగా ముద్ర వేసింది. తర్వాత తానే ఒక పెద్ద రౌడీగా మారడానికి దోహదపడింది. ఇటీవలే విడుదలైన "భాయ్స్ ఆఫ్ బెంగుళూర్" అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బెంగుళూరు ప్రాంతానికి చెందిన పలువురు మాఫియా డాన్లు, రౌడీల జీవితాలను బహిర్గతం చేసిన ఆ పుస్తకంలో తన్వీర్ అహ్మద్ అనే ఒక రౌడీ తాను అమితాబ్ చిత్రాల ద్వారా ఎలా ప్రేరణ పొందాడో చెప్పడం గమనార్హం. బెంగుళూరులోని శివాజీ నగరులో నివసించే తన్వీర్ ఒక దర్జీ కొడుకు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అయిన అతను డాన్, ముఖద్దర్ కా సికిందర్, త్రిశూల్, మిస్టర్ నట్వర్ లాల్ లాంటి సినిమాలు చూసి అందులో ఫైట్లను ప్రాక్టీసు చేసేవాడట. ఎక్కడైనా అన్యాయాలు జరిగితే వెళ్లి ఎదిరించేవాడట. అలాగే కొందరిని కొట్టాడు కూడా. 1984లో అమితాబ్ బచ్చన్ సినిమా "ఇంక్విలాబ్" శివాజీనగర్‌లోని నాగా థియేటర్‌లో విడుదలైనప్పుడు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన తన్వీర్ ఓ వ్యక్తితో గొడవపడినప్పుడు, కోపాన్ని అణుచుకోలేక జేబులో నుండి కత్తి తీసి పొడిచేశాడు. ఆ తర్వాత ఎక్కడ తన మీద కేసు పెడతారో అని భావించి, ముంబయి పారిపోయాడు. ఆ తర్వాత కోలి పైయజ్ అనే మరో లోకల్ డాన్ వద్ద ఉద్యోగం సంపాదించిన తన్వీర్ తాను కూడా ఒక రౌడీ షీటరుగా మారిపోయాడు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించిన "ది భాయ్స్ ఆఫ్ బెంగుళూరు"లో కోడిగిహళ్లి మునెగౌడ, ముత్తప్ప రాయ్, శ్రీధర్, బూట్ హూస్ కుమార్, బెక్కిన కన్ను రాజేంద్ర, శ్రీ రామపుర కిట్టీ లాంటి రౌడీల నిజ జీవిత కథలు కూడా ఉన్నాయి. అలాంటి వారితో సరసన ఒక రౌడీషీటరుగా పేరు సంపాదించిన తన్వీర్ ప్రస్తుతం తన పాత జీవితానికి స్వస్తి చెప్పి.. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతకడం గమనార్హం.

Trending News