న్యూఢిల్లీ: దేశంలో ఎన్డీయే సర్కార్ తీసుకొస్తున్న విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని నిరసన వ్యక్తంచేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్లో ఒకట్రెండు చోట్ల చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ అయిన బుద్వాన్‌లో టీఎంసీకి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)కి మధ్య చోటుచేసుకున్న వాగ్వీవాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. మరోవైపు కూచ్ బిహార్‌లో ఆందోళనకారులు ఓ బస్సును ధ్వంసం చేయగా... నార్త్ 24 పరగనస్లో రైలు పట్టాల సమీపంలో పోలీసులు నాలుగు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వామపక్షాల మద్దతుతో సీఐటియూ (CITU), ఐఎన్టియూసి (INTUC), ఏఐటియూసి (AITUC), హెచ్ఎంఎస్ (HMS), సీఐటీయూ (CITU), ఏఐటీయూసి (AIUTUC), టీయూసిసి (TUCC), ఎస్ఇడబ్లూఏ (SEWA), ఎల్పీఎఫ్ (LPF), యూటీయూసీ (UTUC) సహా 10 కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన ఈ బంద్‌కి ఎక్కడికక్కడ రాష్ట్రాల్లోని కార్మిక సంఘాల నుంచి మద్దతు లభించింది. 12 పాయింట్స్ డిమాండ్లతో కార్మిక సంఘాలు చేపట్టిన ఈ భారత్ బంద్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) పాల్గొనడం లేదు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల్లో భారత్ బంద్‌లో పాల్గొంటున్న కార్మిక సంఘాలు రైలు పట్టాలపై బైఠాయించి రైళ్లను అడ్డుకున్నారు. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేరళలోని తిరువనంతపురం, ఢిల్లీ వీధుల్లో కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి.
నేడు కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కి మహారాష్ట్ర సర్కార్ మద్దతు ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేక విధానాలు తీసుకొస్తోందని ఆ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి అశోక్ చవాన్ అన్నారు. అందుకే భారత్ బంద్‌కి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టుగా అశోక్ చవాన్ పేర్కొన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలుచోట్ల రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు వాహనాలు అడ్డుకుని నిరసన తెలియజేశారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఒకింత అంతరాయం ఏర్పడింది.