ఛాత్రా: జార్ఖండ్ ఎన్నికల సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. అక్కడ బీజేపికి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, జేఎంఎంలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చలు చేసినట్టుగా భారతీయ జనతా పార్టీకి కుల రాజకీయాలు చేయడం తెలీదని అన్నారు. బీజేపికి తెలిసిందల్లా.. నిరుపేదలకు సేవ చేయడమేనని అమిత్ షా స్పష్టంచేశారు. నవంబర్ 30న జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన నేడు.. అమిత్ షా ఛాత్రాలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం పార్టీలను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఓవైపు జార్ఖండ్ యువత రాష్ట్ర విభజన కోసం పోరాటాలు చేస్తోన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, ఏ రకమైన విధానాన్ని అవలంభించిందో చెప్పాల్సిందిగా శిభుసోరెన్‌ని నిలదీశారు. శిభుసోరెన్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓ కూటమిగా ఏర్పడటాన్ని ఉద్దేశించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జార్ఖండ్ రాష్ట్ర విభజన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని.. అప్పుడు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ జార్ఖండ్ కోసం మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని అమిత్ షా మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకొచ్చాకే దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జార్ఖండ్‌ని ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారని అమిత్ షా అన్నారు. జార్ఖండ్‌లో బీజేపి అధికారంలోకి రాకముందు భారీ ఎత్తున అవినీతి జరిగేదని.. కానీ రఘుబర్ దాస్ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. అలాగే జార్ఖండ్‌లో నక్సల్ రహిత వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపి కృషిచేస్తోందని అన్నారు. ఒకప్పుడు చీకటి పడితే బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని.. కానీ ఇప్పుడు జార్ఖండ్‌లో అటువంటి దుస్థితి లేదని అమిత్ షా తెలిపారు.