బీజేపీ మళ్లీ ఆపరేషన్ లోటస్‌కి పాల్పడుతోంది : కుమారస్వామి

జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆశచూపించింది : కుమారస్వామి

Last Updated : May 16, 2018, 04:50 PM IST
బీజేపీ మళ్లీ ఆపరేషన్ లోటస్‌కి పాల్పడుతోంది : కుమారస్వామి

కర్ణాటక ఎన్నికల్లో సరైన సంఖ్యలో స్థానాలు తెచ్చుకోలేని బీజేపీ మరోసారి ఆపరేషన్ లోటస్‌కి పాల్పడుతోంది అని జేడీఎస్ చీఫ్ హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ఆశచూపించిందన్న కుమారస్వామి.. ఆ డబ్బు నల్లధనమా కాదా అనే విషయాన్ని బీజేపీ స్పష్టంచేయాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలు చూస్తోంటే, 2008లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ గుర్తుకొస్తుంది అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ కలిపి 116 మంది ఎమ్మెల్యేలు వున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయేంత మెజారిటీ తమ కూటమికి వుంది. కానీ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుపుతోంది అని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అసలు ఈ 'ఆపరేషన్ లోటస్' అంటే ఏంటి :
2008లో బీజేపి అధిక సంఖ్యలో స్థానాలు గెల్చుకున్నప్పటికీ, అవసరమైన మేజిక్ ఫిగర్ కన్నా మూడు సీట్లు తక్కువయ్యాయి. అయినప్పటికీ డబ్బు, మంత్రి పదవులు ఆశచూపించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన బీజేపీ అప్పట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ పరిణామానికి ప్రతిపక్షాలు పెట్టిన పేరే ఆపరేషన్ లోటస్. అప్పట్లోనూ కర్ణాటకలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అయ్యింది బీఎస్ యడ్యూరప్పనే కావడంతో ప్రస్తుతం యడ్యూరప్ప మరోసారి ఆపరేషన్ లోటస్ 2008కి పాల్పడుతున్నారు అని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Trending News