కావేరి జల వివాదం: నిరాహారదీక్షల్లో సీఎం, డిప్యూటి సీఎం

కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు.

Last Updated : Apr 5, 2018, 09:03 AM IST
కావేరి జల వివాదం: నిరాహారదీక్షల్లో సీఎం, డిప్యూటి సీఎం

చెన్నై: కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నైలో సీఎం పళనిస్వామి,  డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంలు నిరాహారదీక్షలకు దిగారు. పలువురు మంత్రులు నల్లచొక్కాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. కేంద్రం తమ డిమాండ్‌కు దిగివచ్చేవరకు పోరాటం కొనసాగించాలని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.

మరోవైపు.. కావేరీ జల సాధన కోసం 'కావేరీ నదీ యాజమాన్య బోర్డు'ను తక్షణమే ఏర్పాటుచేసి నీరు విడుదల చేయాలన్న డిమాండ్‌తో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. గత ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేసి తమిళనాడుకు న్యాయం చేయాలని డీఎంకే ఆధ్వర్యంలో విపక్షాలు ఆందోళనలకు దిగాయి. చెన్నై సహా పలు ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూర్‌లో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు ఆత్మాహుతికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

నిరసనల్లో అపశ్రుతి

కాగా.. కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ జాతీయ జెండాను దహనం చేశారు. తంజావూరులోని కుంభకోణం సమీపంలోని పదుపడైయూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్న ఈ టీచర్ జాతీయ జెండాను కాల్చే ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అందులో కనిపించారు. విచారణ అనంతరం ఆ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

 

Trending News