ఈ రోజు మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై సిబిఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఆయన రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు అనైతికమైన మార్గాల ద్వారా రెండు ఐఆర్‌సిటిసి సర్వీసు కాంట్రాక్టులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారనే ఆరోపణలతో ఆయనపై ఛార్జిషీటు ఫైలు చేశారు. ఈ ఛార్జిషీటులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వితో పాటు 14 మంది పై అభియోగాలు ఉన్నాయి.
రాంచీ, పూరీ ప్రాంతాలకు సంబంధించిన ఐఆర్‌సిటిసి కాంట్రాక్టులను లాలూ సుజాతా హోటల్స్ అనే ప్రైవేటు సంస్థకి అప్పగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. విజయ్ కొచ్చర్ యజమానిగా ఉన్న ఆ కంపెనీ ఓ బినామి అని కేసులో పేర్కొన్నారు. ఇదే బినామి నుండి లాలూ ఎంతో లబ్ది పొందారని.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి తన అధికారాలు దుర్వినియోగం చేశారని లాలూపై కేసులు నమోదయ్యాయి.
ఎఫ్‌ఐఆర్‌లో కూడా లాలూ కేవలం తన నిజాయితీని పక్కన పెట్టి ఫ్రాడ్ చేయడం కోసమే ఆ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారన్న నేరంపై కేసు నమోదు చేసినట్లు ఉంది. సుజాతా హోటల్స్ కంపెనీకి కాంట్రాక్టు లభించగానే.. ఆ కంపెనికి బినామిగా వ్యవహరించిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీ అధినేత సరళా గుప్తా పదవి నుండి తప్పుకొని సంస్థ తాళాలను రబ్రీదేవి, తేజస్వి యాదవ్ లకు ఇవ్వడం ఎన్నో అనుమానాలకు తావు ఇస్తుండగా.. ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఆ తల్లికొడుకులపై కూడా నమోదు అయ్యాయి. మొత్తమ్మీద ఓ రైల్వే మంత్రి హోదాలో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా లబ్ది చేకూర్చడం కోసం కాంట్రాక్టులను ఎడాపెడా అప్పగించారనే అభియోగాలను కూడా లాలూ ఎదుర్కొంటున్నారు