బ్రేకింగ్ న్యూస్: భారత గగనతలంలో చైనా హెలికాప్టర్లు !!

                 

Last Updated : Oct 25, 2018, 10:23 AM IST
బ్రేకింగ్ న్యూస్: భారత గగనతలంలో చైనా హెలికాప్టర్లు !!

అంతర్జాతీయ నింబంధనలను తుంగలోకి తొక్కడం శత్రుదేశాలైన పాక్ , చైనాలకు అలవాటుగా మారింది. కవ్వింపు చర్యల్లో భాగంగా భారత గగనతలంలో ప్రవేశించి ఈ శత్రుదేశాలు తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. పాక్ కు  చెందిన హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించిన ఘటన మరువక ముందే.. తాజాగా చైనాకు చెందిన  హెలికాప్టర్లు మన గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఏఎన్ఐ ద్వారా విషయం బయటికి పొక్కడంతో కలకలం రేపుతోంది.

 ఏఎన్ఐ ఇచ్చిన సమాచారం ప్రకారం సెప్టెంబరు 27న భారత సరిహద్దు దాటి 4 కి.మీ ముందుకు వచ్చిన చైనాకు చెందిన రెండు హెలికాఫ్టర్లు లడఖ్‌లోని ట్రిగ్ హైట్స్ వద్ద కనిపించాయి. ఏకంగా పదినిమిషాల పాటు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన అనంతరం అవి వెనుదిరిగాయి. ఇప్పుడి విషయం బయటపడి ప్రకంపనలు సృష్టిస్తోంది. గత మార్చిలో కూడా చైనా ఇదే తరహాలో దుస్సాహసం చేసింది.

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించిన సందర్భంలో  భారత వైమానిక దళం కాల్పులు జరపడంతో అది తోకముడిచింది. తాజాగా చైనా హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా ఏకంగా పది నిమిషాలు చక్కర్లు కొట్టడం కవ్వింపు చర్యల్లో భాగమేనని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా భారత గగనతలాన్ని శత్రుదేశాలు పదేపదే ఉల్లంఘిస్తున్నా కేంద్రం ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలోకి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చైనా విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ ఈ సందర్భంగా వినిపిస్తోంది.

Trending News