సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ఓ కోచింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం తక్షిశిల కాంప్లెక్స్ భవన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మృతి చెందినప్పటికీ.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు అగ్ని ప్రమాదం బారి నుంచి తప్పించుకునేందుకు మూడు, నాలుగు అంతస్తుల పై నుంచి కిందకు దూకిన పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు.
ఇదిలావుంటే, అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ దుర్ఘటన తీవ్ర మనోవేధనకు గురిచేసిందన్న ఆయన.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు.